CBN fires on Government: దేశంలో అప్పులు ఎక్కువగా చేసిన రాష్ట్రంగా ఏపీని మార్చేశారని.. తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ముందుకు సాగట్లేదని ఆరోపించారు. పోలవరాన్ని రివర్స్‌గేర్‌లో వెనక్కి తీసుకెళ్తున్నారని ధ్వజమెత్తారు. అన్నింటిపై ఛార్జీలు పెంచి ప్రజలపై భారాన్ని మోపారన్న ఆయన.. విలీనం పేరుతో పాఠశాలలను మాయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. తప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారన్న చంద్రబాబు.. వాటికి భయపడేది లేదని.. గట్టిగా పోరాడతామని స్పష్టం చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. ఇలపర్రు వద్ద చంద్రబాబు కాన్వాయ్ ఆపిన స్థానికులు.. తమ గోడును వెల్లబోసుకున్నారు. శ్రీలంక ప్రజల కంటే ఏపీ ప్రజలకు ఓర్పు ఎక్కువని.. అందుకే ఇంకా తిరుగుబాటు చేయలేదన్నారు. దేశంలో అధిక ధరలకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చారని ఆరోపించారు. బాదుడే బాదుడు అంటూ సామాన్యుల నడ్డివిరిచారని మండిపడ్డారు.