ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సాక్షుల్ని జగన్ ప్రభావితం చేయెుచ్చు!

అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరిన జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థనను తిరస్కరించాలని సీబీఐ.. కోర్టును కోరింది. చట్టం ముందు జగన్​తో సహా ప్రజలందరూ సమానమేనన్న సీబీఐ, మినహాయింపు రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. జగన్​కు ఉన్న ఆధునిక వసతులతో 275 కి.మీటర్లు ప్రయాణించడం అంత కష్టమేమీ కాదని అభిప్రాయపడింది. జగన్ మినహాయింపు పిటిషన్​లో చెప్పిన కారణాలు సహేతుకంగా లేవని.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది.

జగన్ వ్యక్తిగత మినహాయింపుపై సీబీఐ తీవ్ర అభ్యంతరం

By

Published : Oct 1, 2019, 7:59 PM IST

Updated : Oct 2, 2019, 2:17 AM IST

జగన్ వ్యక్తిగత మినహాయింపుపై సీబీఐ తీవ్ర అభ్యంతరం
అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరిన జగన్ అభ్యర్థనపై సీబీఐ తీవ్ర అభ్యంతరం తెలిపింది. జగన్ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. వాస్తవాలను దాచిపెట్టి జగన్ కోర్టును ఆశ్రయించారని కౌంటర్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ (కేదాస) తెలిపింది. మినహాయింపు ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ అభ్యంతరం తెలిపింది. మినహాయింపునకు జగన్ పిటిషన్​లో తెలిపిన ఏపీ పునర్విభజన అంశాలు, గత ప్రభుత్వ పనితీరు ఈ కేసుతో సంబంధం లేదని సీబీఐ పేర్కొంది. ఆర్థిక, రెవెన్యూ అంశాల ప్రస్తావన వాస్తవాలను పక్కదారి పట్టించే యత్నమేనని కేదాస అభిప్రాయపడింది. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే తీవ్ర అభియోగాలు జగన్‌పై ఉన్నట్లు గతంలో సుప్రీం పేర్కొన్న విషయాన్ని సీబీఐ ఉటంకించింది. రెవెన్యూ లోటనేది వ్యక్తిగత హాజరు మినహాయింపునిచ్చే కారణం కాదని చెప్పింది.

275 కి.మీ ప్రయాణించడం కష్టమేమీ కాదు : సీబీఐ
విజయవాడ నుంచి వారానికోసారి రావడం కష్టమవుతుందన్నది సరైన కారణం కాదని సీబీఐ... కోర్టుకు తెలిపింది. జగన్​కు ఆధునిక వసతులతో 275 కి.మీ ప్రయాణించడం కష్టమేమీ కాదన్న కేదాస... ఆర్థిక ప్రభావంతో సాక్ష్యాలను తారుమారు చేస్తారనే గతంలో జగన్​ను అరెస్టు చేశామని కోర్టుకు తెలిపింది. ఇప్పుడు ప్రభుత్వాధినేతగా జగన్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం మరింత ఎక్కువగా ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థ అభిప్రాయపడింది. సీఎం కుమారుడిగానే అక్రమ ఆర్థిక లావాదేవీలు చేశారని జగన్​పై అభియోగాలున్నాయని.. ఇప్పుడు ఆయనే సీఎంగా ఉన్నారని సీబీఐ పేర్కొంది. జగన్ జైల్లో ఉన్నప్పుడే తన బలాన్ని ప్రదర్శించి సాక్షులను ప్రభావితం చేశారన్న సీబీఐ... ప్రజాప్రయోజనాల రీత్యా జగన్ అభ్యర్థనలన్నీ తిరస్కరించాలని సీబీఐ... కోర్టును కోరింది.

మినహాయింపు రాజ్యాంగం విరుద్ధం : సీబీఐ
వ్యక్తిగత ప్రయోజనాల కన్నా ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని జగనే అంటున్నారన్న సీబీఐ... బెయిల్ కోరినప్పుడు అంగీకరించిన షరతులకు కట్టుబడి ఉండాలని సీబీఐ సూచించింది. అత్యవసర పరిస్థితి ఉంటే ఆ రోజు మినహాయింపు కోరవచ్చని తెలిపింది. ప్రజావిధుల్లో ఉన్నందున మినహాయింపు ఇవ్వాలనడం రాజ్యాంగ విరుద్ధమని సీబీఐ... కోర్టుకు తెలిపింది. చట్టం ముందు జగన్​తో సహా ప్రజలందరూ సమానులేనన్న సీబీఐ అభిప్రాయపడింది.

Last Updated : Oct 2, 2019, 2:17 AM IST

ABOUT THE AUTHOR

...view details