ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Viveka Murder Case: వివేకా హత్య కేసు.. ఛార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు ప్రాథమిక అభియోగ పత్రం దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ తర్వాత పులివెందుల కోర్టులో ప్రిలిమినరీ ఛార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ... నలుగురు నిందితుల ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోసారి పూర్తిస్థాయి ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. సునీల్ యాదవ్ 90 రోజుల రిమాండు గడువు ముగుస్తున్నందున సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది.

Viveka Murder Case
Viveka Murder Case

By

Published : Oct 26, 2021, 3:08 PM IST

Updated : Oct 27, 2021, 4:02 AM IST

కడప జిల్లా పులివెందులకు చెందిన మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు ఏడాది పాటు దర్యాప్తు చేసి ఇప్పటివరకూ ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పులివెందులకు చెందిన సునీల్ యాదవ్‌ను ఈ ఏడాది ఆగస్టు 4న అరెస్ట్ చేసి పులివెందుల కోర్టులో హాజరు పరిచారు. సెప్టెంబర్‌ 9న సింహాద్రిపురం మండలం సుంకేశుల గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త ఉమాశంకర్ రెడ్డిని అరెస్టు చేశారు. వీరిద్దరూ ప్రస్తుతం కడప జైల్లో రిమాండు ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసులో నలుగురి ప్రమేయం ఉందని సీబీఐ ప్రాథమిక విచారణలో తేల్చింది. వారిలో ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, డ్రైవర్ దస్తగిరి పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి అరెస్ట్ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండు రిపోర్టులో అవే విషయాలు పొందు పరిచారు.

2019 మార్చి 14వ తేదీ రాత్రి సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి ఒకే పల్సర్ బైకులో వివేకా ఇంటికి గొడ్డలితో వచ్చి తిరిగి పారిపోయినట్లు సీబీఐ అధికారులు పేర్కొన్నారు. వాచ్ మెన్ రంగన్న మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి పేర్లు ప్రస్తావించారు. హత్యాస్థలంలో ఈ నలుగురు వ్యక్తులు ఉన్నట్లు సీబీఐ ట్రయల్స్ నిర్వహించింది. పక్కా ఆధారాలు లభించడంతో సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దస్తగిరిని అరెస్ట్ చేయాల్సి ఉండగా... ఇటీవల కడప కోర్టు నుంచి ముందస్తు బెయిలు తెచ్చుకున్నారు. మాజీ డ్రైవర్ దస్తగిరి నుంచి సీబీఐ వాంగ్మూలం నమోదు చేయించింది. ఇక సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగాలతో ఎర్రగంగిరెడ్డిని 2019 మార్చి 28న సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అతను ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. ఈ కేసులో అరెస్ట్ చేయాలంటే బెయిలు రద్దు చేయాల్సి ఉంది. అతని బెయిలు రద్దు చేయాలని పులివెందుల కోర్టులో సీబీఐ వేసిన బెయిలు పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో సునీల్ యాదవ్ ను అరెస్ట్ చేసి నవంబర్ 4వ తేదీకి 90 రోజుల గడువు ముగుస్తుంది. 90 రోజులు దాటిన తర్వాత బెయిలు వచ్చే అవకాశం ఉంది. ఆలోపే ఛార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉండటంతో... సీబీఐ అధికారులు మంగళవారం ప్రాథమిక అభియోగపత్రం దాఖలు చేశారు.

ఛార్జిషీట్ లో ఇంకా ఎవరెవరి పేర్లు ఉన్నాయి.? హత్య కేసులో ఎవరి పాత్ర ఉందనే విషయాలు బయటికి వెల్లడి కాలేదు. మరికొద్ది రోజుల్లోనే సీబీఐ అధికారులు పూర్తిస్థాయి ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత అసలు హంతకులు, పాత్రధారులు, సూత్రధారుల ప్రమేయాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి

Last Updated : Oct 27, 2021, 4:02 AM IST

ABOUT THE AUTHOR

...view details