ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వివేక హత్య కేసులో బుధవారం నుంచి అనుమానితుల విచారణ! - వివేకా హత్యకేసు

మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగంగా సాగుతోంది. నాలుగో రోజు విచారణ చేపట్టిన అధికారులు... వివేకా ఇంటిని మరోసారి పరిశీలించి కొలతలు తీసుకున్నారు. హత్యా స్థలం, ఇంటి చుట్టు కొలతలు, ఎన్ని తలుపులు, కిటికీలు ఉన్నాయనే వివరాలు నమోదు చేసుకున్నారు. బుధవారం నుంచి అనుమానితులను ప్రశ్నించే వీలుందని తెలుస్తోంది.

ys vivekananda reddy murder case
ys vivekananda reddy murder case

By

Published : Jul 21, 2020, 12:13 PM IST

Updated : Jul 21, 2020, 7:34 PM IST

మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో నాల్గో రోజు పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు... ఎక్కువ సమయం డీఎస్పీ కార్యాలయంలోనే గడిపారు. హత్య కేసు వివరాలు, సిట్ దర్యాప్తు నివేదిక క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. ఒక బృందం పులివెందులలోని వివేకా ఇంటిని మరోసారి పరిశీలించింది. సోమవారం వివేకా ఇంట్లో 3 గంటలపాటు పరిశీలించి... వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత ద్వారా వివరాలు సేకరించిన సీబీఐ.. మంగళవారం ఇంటిని మళ్లీ పరిశీలించింది.

ఇవాళ హత్యా స్థలంలో పక్కా ఆధారాలు సేకరించేందుకు కావాల్సిన కొలతలు నమోదు చేసుకుంది. పులివెందుల మున్సిపాలిటీ సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది ఇంటి కొలతలు వేశారు. ఇంటి పడకగది, స్నానపు గదిలోనే వివేకా హత్య జరిగింది. పడకగది నుంచి స్నానపు గదికి ఎన్ని మీటర్లు దూరం ఉంది... వెడల్పు ఎంత ఉంది... ఎత్తు ఎన్ని మీటర్లు ఉంది అనే వివరాలు నమోదు చేశారు.

ఆధారాల్లేని హత్య కేసును ఛేదించడానికి రంగంలోకి దిగిన సీబీఐ... ముందుగా సంఘటనా స్థలంలో కొలతలు నమోదు చేసింది. తర్వాత ఇంటికి ఎన్ని ద్వారాలు, తలుపులు, కిటికీలు ఉన్నాయనే వివరాలు నమోదు చేశారు. హంతకులు ఏ ద్వారం గుండా వచ్చింటారనే సమాచారం తెలుసుకునేందుకు వివరాలు నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. వివేకా పడకగదికి... వాచ్ మెన్ రంగన్న పడుకున్న స్థలానికి ఎంత దూరం ఉందనే వివరాలు నమోదు చేసుకున్నారు.

వివేకా ఇంటిని కొలతలు వేసే సమయంలో ఇంట్లో వివేకా భార్య సౌభాగ్యమ్మ మాత్రమే ఉన్నారు. సీబీఐ అధికారులు రాకముందే వివేకా కుమార్తె సునీత బయటికి వెళ్లిపోయారు. ఇక్కడ వివరాలు నమోదు చేసుకున్న తర్వాత... సీబీఐ అధికారులు మళ్లీ డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు డీఎస్పీ కార్యాలయంలోనే మకాం వేసి... కేసు దర్యాప్తు వివరాలు అధ్యయనం చేస్తున్నారు.

సిట్ అధికారులు చేసిన దర్యాప్తు నివేదికను అధ్యయం చేస్తున్న సీబీఐ... బుధవారం నుంచి కేసులో అనుమానితులను విచారించేందుకు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఎవరిని ముందుగా విచారణకు పిలుస్తారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే సిట్ అధికారులు 1300 మంది అనుమానితులను విచారించినా కేసులో పురోగతి లేదు. మళ్లీ పాతవారినే సీబీఐ విచారిస్తుందా... లేక తమ కోణంలో విచారణ మొదలు పెడుతుందా అనేది తెలియాల్సి ఉంది. వివేకా కుమార్తె సునీత అనుమానిస్తున్న 15 మంది వ్యక్తుల జాబితాను సీబీఐ పక్కాగా నమోదు చేస్తున్నట్లు సమాచారం. సీబీఐ అధికారులు రాత్రికి కడప చేరుకున్నారు.

ఇదీ చదవండి:

వివేకా హత్య కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించారు: హైకోర్టు

Last Updated : Jul 21, 2020, 7:34 PM IST

ABOUT THE AUTHOR

...view details