CBI Hearing in Vanpic Case : జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో ముడుపులుగా రూ.854కోట్లు పెట్టుబడులు పెట్టడం ద్వారా అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం రూ.17వేల కోట్ల విలువైన వాన్‌పిక్ ప్రాజెక్టును కేటాయించిందని సీబీఐ మంగళవారం హైకోర్టుకు నివేదించింది. అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగాలు ఏవీ లేకుండానే 12 వేల ఎకరాలను ప్రాజెక్టు పేరుతో పొందారని పేర్కొంది. ప్రభుత్వ ప్రయోజనాలను ఆశించే వ్యక్తులు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే.. ఆయన తండ్రి వై.ఎస్. ఆ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా ప్రాజెక్టులు అప్పగిస్తారని పేర్కొంది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో నమోదైన కేసును కొట్టివేయాలంటూ వాన్‌పిక్, నిమ్మగడ్డ ప్రసాద్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ చేపట్టారు.
సీబీఐ తరఫు న్యాయవాది కె.సురేందర్ వాదనలు వినిపిస్తూ... ‘మొత్తం కేసును కలిపి చూడాలి. అందరూ కలిసి కుట్ర పన్నారు. నిందితుల పాత్రను విడివిడిగా చూడరాదు. బాంబు తయారీ నిమిత్తం ఒక వ్యక్తి డబ్బు సమకూరిస్తే కేవలం డబ్బు ఇచ్చానని ఒకరు, కొరియర్‌గా డబ్బు అందించానని మరొకరు, డబ్బిస్తే బాంబు తయారీ సామగ్రి ఇచ్చానని ఇంకొకరు, తయారు చేసి ఇవ్వమన్నారని, ఫలానా ప్రాంతంలో బాంబు పెట్టామని చెబితే పెట్టానని వేరొకరు ఇలా ఎవరికి వారు విడిగా చెబితే ఎవరూ తప్పుచేయనట్లే. ఇలా విడివిడిగా చూస్తే తమకు సంబంధంలేదంటారు. బ్యాంకు కుంభకోణాలతో సహా కుట్రలో అందరి పాత్రను కలిపి చూడాలి. జగన్, సాయిరెడ్డిలు అన్ని కేసుల్లోనూ నిందితులుగా ఉన్నారు. వారు జగతి పబ్లికేషన్స్, కార్మెల్ ఏసియా, రఘురాం సిమెంట్స్ ఇలా సంస్థలను ముడుపులు స్వీకరించడానికి ఏర్పాటు చేశారు..’ అని సీబీఐ వివరించింది.