ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్, విజయసాయిరెడ్డి వ్యాజ్యాలపై సీబీఐ, ఈడీ అభ్యంతరం - జగన్ అక్రమాస్తుల కేసు విచారణ తాజా న్యూస్

అక్రమాస్తుల కేసుల్లో చార్జిషీట్లన్నీ కలిపి విచారణ జరపాలన్న జగన్, విజయసాయిరెడ్డి వాదన సమంజసం కాదని సీబీఐ వాదించింది. నిందితుల్లో ఎవరో ఒకరు ఏదో పిటిషన్ దాఖలు చేస్తూ... ఏడేళ్లయినా కేసును ముందుకు సాగనీయడం లేదని పేర్కొంది. విచారణ మరింత జాప్యం చేసేందుకే రకరకాల వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారని ఈడీ వాదించింది.

jagan, vijayasai reddy

By

Published : Nov 22, 2019, 11:19 PM IST

అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ దాఖలు చేసిన 6 ఛార్జిషీట్లను కలిపి విచారణ చేపట్టాలని కోరుతూ... ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్రమాస్తుల కేసులో కుట్ర ఒకటే అయినప్పటికీ... నిందితులు, నేరాలు వేర్వేరని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో కేంద్ర దర్యాప్తు సంస్థ వాదించింది.

జగన్, విజయసాయిరెడ్డి మినహా... మిగతా నిందితులు వేర్వేరని పేర్కొంది. ఉదాహరణకు హెటిరో, అరబిందో, వాన్ పిక్ కేసుల కుట్ర భూములకు సంబంధించిందే అయినప్పటికీ... వాటిలో ప్రమేయమున్న నిందితులు వేరని వివరించింది. లాలూప్రసాద్ యాదవ్ కేసులో కూడా విడివిడిగానే విచారణ జరిగిందని ప్రస్తావించింది. ప్రస్తుతం డిశ్చార్జి పిటిషన్ల విచారణ దశలోనే కేసు ఉందని... ఇంకా అభియోగాల నమోదు ప్రక్రియ ప్రారంభమే కాలేదని సీబీఐ తరఫు న్యాయవాది సురేందర్ పేర్కొన్నారు. ఎవరెవరిపై ఏయే అభియోగాలు నమోదవుతాయో ఇప్పుడే చెప్పలేమన్నారు.

జాప్యం చేసేందుకే పిటిషన్ల దాఖలు

కేసు విచారణ త్వరగా చేపట్టాలని గతంలో హైకోర్టు ఆదేశించిందని న్యాయవాది సురేందర్ అన్నారు. అయితే నిందితులు ఏదో ఒక పిటిషన్ దాఖలు చేస్తూ ఏడేళ్లయినా ముందుకు సాగనీయడం లేదని పేర్కొన్నారు. జాప్యం చేయడం వల్ల నిందితులే నష్టపోతున్నారని.. కేసు త్వరగా తేలడం లేదన్నారు. నిందితులు గతంలోనూ ఇలాంటి పిటిషన్లు దాఖలు చేశారని.. వాటిని కోర్టులు కొట్టివేశాయని ఈడీ వాదించింది. మరింత జాప్యం చేసేందుకు నిందితులు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఈడీ తరఫు న్యాయవాది వాదించారు. తదుపరి వాదనల కోసం విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి

రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ మ్యాప్ విడుదల

ABOUT THE AUTHOR

...view details