జగన్ అభ్యర్థన పిటిషన్పై నేడు సీబీఐ కోర్టు తీర్పు - CBI court verdict on Jagan's plea today news
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై నేడు సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. మరోవైపు మినహాయింపును వ్యతిరేకిస్తూ సీబీఐ గట్టిగా వాదించింది.
అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపునకు ఏపీ సీఎం వైఎస్ జగన్ పెట్టుకున్న అభ్యర్థనపై నేడు సీబీఐ కోర్టు నిర్ణయం వెల్లడించనుంది. సీబీఐ న్యాయస్థానంలో గత నెల 18న ఇరువైపుల వాదనలు ముగిశాయి. ప్రతీ శుక్రవారం విచారణకు తన బదులుగా న్యాయవాది హాజరయ్యేలా అనుమతివ్వాలని జగన్ అప్పీల్ చేసుకున్నారు. ఏపీ రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రిగా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. విజయవాడ నుంచి హైదరాబాద్లోని కోర్టుకు హాజరు కావడానికి సుమారు రెండు రోజులు పడుతోందన్నారు. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా తాను ఎక్కువ సమయం ఏపీలోనే కేటాయించాల్సి ఉందన్నారు.
మినహాయింపిస్తే ప్రభావితం చేస్తారు: సీబీఐ
మరోవైపు జగన్ అభ్యర్థనపై సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే కేసు విచారణకు తీవ్ర జాప్యం జరుగుతోందని.. ఇప్పుడు సీఎం జగన్కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తే కేసు విచారణ మరింత ఆలస్యం అవుతుందని వాదించింది సీబీఐ. సీఎం జగన్ రాజకీయ, ధన, అర్ధ, అంగ బలంతో సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేసే ప్రమాదం పొంచి ఉందన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని.. సీఎం అయినంత మాత్రాన... వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ బలంగా వాదనలు వినిపించింది. గతంలో ఇదే అభ్యర్థనపై జగన్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసినందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ కోర్టు... నేడు తుది తీర్పును వెల్లడించనుంది.
ఇవీ చూడండి : పోలవరంపై స్టే ఎత్తివేత
TAGGED:
jagan cbi case news