ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

JAGAN BAIL: జగన్‌ బెయిలు రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరణ - జగన్‌ బెయిల్‌

1
1

By

Published : Sep 15, 2021, 2:46 PM IST

Updated : Sep 16, 2021, 4:47 AM IST

14:45 September 15

jagan bail

   అక్రమాస్తుల కేసుల్లో ప్రధాన నిందితులైన ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలకు గతంలో మంజూరుచేసిన బెయిలును రద్దు చేయడానికి సీబీఐ ప్రధాన కోర్టు నిరాకరించింది. వీరి బెయిలును రద్దు చేయడానికి తగినన్ని కారణాలు లేవంది. ఈ మేరకు ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ రఘురామ కృష్ణరాజు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై తీర్పు వాయిదా వేసిన నేపథ్యంలో రెండో నిందితుడైన ఎంపీ విజయసాయిరెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై వాదనలు విన్న సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బి.ఆర్‌.మధుసూదన్‌రావు బుధవారం తీర్పు వెలువరించారు. జగన్‌, విజయసాయిరెడ్డి తమ అధికారంతో సాక్షులను ప్రభావితం చేస్తారని, విచారణను అడ్డుకోడానికి ఈ కేసుల్లో నిందితులకు కీలక పదవులను అప్పగించారంటూ రఘురామ కృష్ణరాజు తరఫు న్యాయవాది చేసిన వాదనలతో న్యాయమూర్తి విభేదించారు. తమను ప్రభావితం చేసినట్లు ఏ ఒక్క సాక్షీ ఫిర్యాదు చేయలేదని, బెయిలు షరతులను ఉల్లంఘించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, అధికారంలో ఉన్నంత మాత్రాన సాక్షులను ప్రభావితం చేస్తున్నారంటే సరికాదన్న జగన్‌, సాయిరెడ్డిల తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించారు. రఘురామ పిటిషన్లను కొట్టేస్తూ న్యాయమూర్తి తీర్పు కాపీ రావాల్సి ఉంది.

‘సాక్షి’ది కోర్టు ధిక్కరణగా పరిగణన
విజయసాయిరెడ్డి బెయిలు రద్దు పిటిషన్‌పై వాదనలు కొనసాగుతుండగానే జగన్‌ బెయిలు రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేేశారంటూ ‘సాక్షి’ వెబ్‌ మీడియాలో ట్వీట్‌ చేయడాన్ని కోర్టు ధిక్కరణగానే సీబీఐ కోర్టు పరిగణించింది. సాక్షి ఎడిటర్‌ మురళి, సీఈఓ వినయ్‌ మహేశ్వరిలపై దాఖలైన ధిక్కరణ పిటిషన్‌ను తదుపరి చర్యల నిమిత్తం హైకోర్టుకు నివేదిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ పిటిషన్‌కు చెందిన రికార్డును హైకోర్టుకు పంపాలని సీబీఐ కోర్టు కార్యాలయానికి న్యాయమూర్తి బి.ఆర్‌.మధుసూదన్‌రావు ఉత్తర్వులు జారీచేశారు. ఈ అంశంపై ఎంపీ రఘురామ సీబీఐ కోర్టులో ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు.

అపోహల కారణంగా బదిలీ చేయలేం: హైకోర్టు
ఒక కేసులో కేవలం అపోహల కారణంగా కింది కోర్టుల్లో కేసులను బదిలీ చేయడానికి కుదరదని తెలంగాణ హైకోర్టు బుధవారం స్పష్టం చేసింది. కేసు బదిలీకి సరైన కారణాలు, ఆధారాలు చూపకుండా బదిలీ చేయాలనడం సరికాదని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసిందని పేర్కొంది. అక్రమాస్తుల కేసుల్లో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డిల బెయిలును రద్దుచేయాలంటూ తాను దాఖలు చేసిన పిటిషన్లను సీబీఐ ప్రధాన కోర్టు నుంచి హైదరాబాద్‌ లేదంటే తెలంగాణలో మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. ఈ పిటిషన్‌పై విచారించిన జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ బుధవారం తీర్పు వెలువరిస్తూ కేవలం అపోహల కారణంగా కేసులను బదిలీ చేయలేమన్నారు. అంతేకాకుండా పిటిషనర్‌ చెబుతున్నట్లు సాక్షి వెబ్‌ మీడియాలో జగన్‌ బెయిలు పిటిషన్‌ను కొట్టేశారని చెప్పడంతోపాటు బెయిలు రద్దు పిటిషన్లపై తీర్పును వాయిదా వేసిన మర్నాడే విదేశాలకు వెళ్లడానికి విజయసాయిరెడ్డికి అనుమతించారని కారణంగా సందేహించడాన్ని తప్పుబట్టారు. ఈ ఉత్తర్వులు ఇచ్చి 12 రోజులైందని, ఇప్పటివరకు ఆ ఉత్తర్వులను సీబీఐ గానీ, రఘురామ కృష్ణరాజు గానీ సవాలు చేయలేదన్నారు. విజయసాయిరెడ్డి బెయిలు షరతులను ఉల్లంఘించినట్లు సీబీఐ ఎక్కడా చెప్పలేదన్నారు. సరైన కారణాలు లేకుండా కేవలం అపోహలతో పిటిషన్లను బదిలీ చేయాలనడం సరికాదంటూ, రఘురామ కృష్ణరాజు పిటిషన్‌ను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

న్యాయమే గెలిచింది: సజ్జల

‘సీఎం జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన వ్యాజ్యాన్ని సీబీఐ కోర్టు కొట్టేయడం వల్ల చివరకు న్యాయమే గెలిచిందని’ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ‘లేనిపోని ఆరోపణలు చేస్తూ గాలిపోగేసి రఘురామకృష్ణరాజు వేసిన కేసు ఇది. ఇందులో ఏ వాస్తవమూ లేదు. తిరస్కరణకు గురవుతుందని కేసు వేసిన రోజునే అనుకున్నాం’ అన్నారు.

హైకోర్టుకు వెళతా: రఘురామ

జగన్‌ బెయిల్‌ రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరించినందున దానిపై తాను హైకోర్టుకు అప్పీల్‌కు వెళతానని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వెల్లడించారు.

ఇదీ చదవండి:

వివేకా హత్య కేసులో 100వ రోజు సీబీఐ విచారణ

Last Updated : Sep 16, 2021, 4:47 AM IST

ABOUT THE AUTHOR

...view details