ఆంధ్రప్రదేశ్

andhra pradesh

JAGAN CBI CASE: జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ వాయిదా

By

Published : Jul 8, 2021, 2:14 PM IST

Updated : Jul 8, 2021, 7:33 PM IST

సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. గత విచారణ సమయంలో.. లిఖితపూర్వక వాదనలు సమర్పించాలన్న కోర్టు ఆదేశాలతో.. జగన్, రఘురామ లిఖితపూర్వక వాదనలు సమర్పించారు. సీబీఐ లిఖితపూర్వక వాదనలు సమర్పించబోమని చెప్పింది. ఈ కేసు విచారణను కోర్టు ఈ నెల 14కి వాయిదా వేసింది.

jagan cbi
jagan cbi

జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్​పై సీబీఐ తన తటస్థ వైఖరిని కొనసాగించింది. ఈనెల 1న రఘురామ కృష్ణరాజు, జగన్ తరఫు వాదనలు విన్న సీబీఐ కోర్టు.. ఇవాళ జగన్, రఘురామతో పాటు సీబీఐని కూడా వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించాలని ఆదేశించింది. ఇవాళ జగన్, రఘురామ మాత్రమే లిఖితపూర్వక వాదనలు దాఖలు చేశారు. పిటిషన్​లోని అంశాలను విచక్షణ మేరకు, చట్ట ప్రకారం కోర్టే నిర్ణయం తీసుకోవాలని గత నెల 1న దాఖలు చేసిన మెమోనే తమ వాదనగా పరిగణనలోకి తీసుకోవాలని.. లిఖితపూర్వక వాదనలేమీ లేవని ఇవాళ సీబీఐ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానానికి తెలిపారు.

రఘురామ లిఖితపూర్వక వాదనలు..

కోర్టు షరతులు ఉల్లంఘించినందున జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ కృష్ణరాజు లిఖితపూర్వక వాదనల్లో కోరారు. తనకు పిటిషన్ వేసే అర్హత ఉందని సీబీఐ కోర్టు ఏప్రిల్ 27నే తేల్చిందని.. ఎవరైనా పిటిషన్ వేయవచ్చునని సుప్రీంకోర్టు, హైకోర్టులో గతంలో స్పష్టతనిచ్చాయని వివరించారు. సాక్షుల మనసులో భయం కలిగించేందుకు సహచర నిందితులకు పలు ప్రయోజనాలు, కీలక పదవులు కల్పించారన్నారు. ఓఎంసీ కేసులో నిందితుడిగా ఉన్న సజ్జల దివాకర్ రెడ్డి సోదరుడు సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారని రఘురామ తెలిపారు. మోపిదేవి వెంకటరమణను రాజ్యసభ సభ్యుడిగా, మురళీధర్ రెడ్డిని కలెక్టర్​గా, వైవీ సుబ్బారెడ్డిని తితిదే ఛైర్మన్ గా నియమించారన్నారు.

నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియాలో అరెస్టయినప్పుడు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి వద్దకు ఎంపీల బృందాన్ని పంపించి ఒత్తిడి తెచ్చారన్నారు. అరబిందోకు కాకినాడ సెజ్ అభివృద్ధి పనులు, హెటిరోకు విశాఖ బేపార్క్ రిసార్టు నిర్వహణ, తన కుటుంబానికి చెందిన జగతి పబ్లికేషన్స్​కు భారీగా ప్రకటలను ఇచ్చి లబ్ధి చేకూర్చారని లిఖితపూర్వక వాదనల్లో తెలిపారు. ముఖ్యమంత్రిగా జగన్.. ప్రభుత్వంలో వివిధ పదవుల్లో సహ నిందితులు.. సాక్షులుగా ఉన్న అధికారులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రలోభపెట్టే అవకాశం ఉందని రఘురామ తన వాదనల్లో పేర్కొన్నారు.

సాక్షులుగా ఉన్న సీనియర్ అధికారులను పరోక్షంగా బెదిరించేందుకు అఖిల భారత సర్వీసుల అధికారుల ఏఏఆర్ లను సమీక్షించే అధికారాన్ని జగన్ తన పరిధిలోకి తెచ్చుకున్నారనేది రఘురామ వాదన. బెయిల్ రద్దు చేయడానికి ఇది కూడా కారణంగా పరిగణించాలని కోర్టును కోరారు. సాక్షిగా ఉన్న నిమ్మగడ్డ రమేశ్​ను చెప్పినట్లు విననందుకు వేధించారని ఆరోపించారు. రాజ్యాంగ స్వయంప్రతిపత్తి ఉన్న ఎస్ఈసీనే వేధించారంటే.. ఇక ఇతర అధికారుల పరిస్థితని ఊహించుకోవచ్చునన్నారు.

తనపై ఏపీ పోలీసుసు నమోదు చేసిన ఏడు కేసుల్లో ప్రాథమిక సాక్ష్యాలు లేవని ఏపీ హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు. పిటిషన్ వేసినందుకు ఎంపీగా ఉన్న తనపైనే ఏపీ సీఐడీ ద్వారా తప్పుడు కేసులు పెట్టి వేధించారని.. ఇక సాక్ష్యం చెప్పబోయే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని కోర్టుకు సూచించారు. జగన్ బెయిల్ రద్దు చేసేందుకు తనపై వేధింపుల ఘటన ఒక్కటి చాలని రఘురామ ఉదహరించారు. తన వాదనలను జగన్ తోసిపుచ్చలేదని.. కాబట్టి వాటిని పరిగణనలోకి తీసుకొని బెయిల్ రద్దు చేసి జైలుకు పంపించాలని ఎంపీ కోరారు.

జగన్​ తరఫు వాదనలిలా..

రఘురామకృష్ణ రాజు పిటిషన్​కు విచారణ అర్హతే లేదని.. కొట్టివేయాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లిఖితపూర్వక వాదనల్లో కోరారు. ఎవరైనా పిటిషన్ వేయవచ్చుననే సుప్రీంకోర్టు తీర్పును తప్పుగా అన్వయిస్తున్నారని.. ఎవరైనా జోక్యం చేసుకునేందుకు క్రిమినల్ కేసులు ప్రజా ప్రయోజనాలు కావన్నారు. ఎంపీగా అనర్హత వేటు వేయాలని వైకాపా కోరినందుకే.. తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయవ్యవస్థను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పిటిషన్ వేయగానే మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకోవడం ఆయన ఉద్దేశాలను స్పష్టం చేస్తోందని జగన్ పేర్కొన్నారు. కాబట్టి అనుమానాస్పద, తగిన విశ్వసనీయత లేని పిటిషన్​గా ఎంపీ పిటిషన్​ను పరిగణించాలన్నారు.

సీఎంగా ఉన్నందున బెయిల్ రద్దు చేయాలంటున్నారు తప్ప.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా సరైన కారణంగా ఒక్కటి కూడా చూపలేదని జగన్ పేర్కొన్నారు. సంబంధం లేని విషయాలను ప్రస్తావించి.. సాక్షులను ప్రభావితం చేస్తారని ఊహించి.. పిటిషన్లు వేయడం తగదని చెప్పారు. తనపై బ్యాంకు రుణాల దుర్వినియోగం కేసులను ప్రమాణ పత్రంలో ప్రస్తావించలేదన్నారు. దురుద్దేశపూర్వక పిటిషన్లను ఆదిలోనే కొట్టేసే స్వేచ్ఛ కింది కోర్టుకు సర్వోన్నత న్యాయస్థానం కల్పించిందన్నారు.

కేసుల విచారణను రోజువారీగా అత్యంత వేగంగా సీబీఐ కోర్టు నిర్వహిస్తోందని జగన్ వివరించారు. కేసులు వాయిదా వేయాలని తాను ఎన్నడూ కోరలేదన్నారు. తప్పుడు కేసుల నుంచి త్వరగా విముక్తి పొందేందుకు.. కేసుల విచారణ వేగంగా జరగాలనే కోరుకుంటున్నట్లు జగన్ పేర్కొన్నారు. తాను హాజరు కాలేని పక్షంలో న్యాయవాది వస్తున్నారని.. కోర్టు విచక్షణను కూడా పిటిషనర్ ప్రశ్నిస్తున్నారని అన్నారు. సీబీఐ కేంద్ర పరిధిలో ఉంటుందని.. ఏపీ ప్రభుత్వం పరిధిలో కాదన్నారు.

కోర్టే తగిన నిర్ణయం తీసుకోవాలని సీబీఐ ప్రస్తావించడం.. ఆ సంస్థ తన పరిధిలో లేదనేందుకు నిదర్శనమన్నారు. రఘురామ సీబీఐ దర్యాప్తును తప్పుపట్టకుండా తన బెయిల్ రద్దు చేయాలనడం.. రాజకీయ కారణాలతో పిటిషన్ వేసినట్లు అంగీకరించడమేనన్నారు. రఘురామ పిటిషన్​ను కొట్టివేయాలని జగన్ కోరారు. పిటిషన్​లో మరిన్ని వాదనలు వినిపిస్తానని రఘురామకృష్ణ రాజు తరఫు న్యాయవాది కోరారు. అయితే ఆన్ లైన్ విచారణలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో.. తదుపరి విచారణను ఈనెల 14కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

CM JAGAN TOUR: 74 ఉడేగోళంలో రైతు భరోసా కేంద్రం ప్రారంభించిన సీఎం

Last Updated : Jul 8, 2021, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details