'హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్యకు, మీకూ మధ్య జరిగాయని పేర్కొంటున్న ఫోన్ సంభాషణల రికార్డు, వాటిని రికార్డు చేసిన ఫోను, ఆ సంభాషణల స్క్రిప్టు సహా ఈ వ్యవహారానికి సంబంధించి మీ వద్దనున్న ఇతర ముఖ్యమైన ఆధారాలు అన్నింటినీ మాకు అందజేయండి' అని సీబీఐ అధికారులు జడ్జి రామకృష్ణను కోరారు. మంగళవారం తమ ఎదుట విచారణకు హాజరై ఈ కేసుకు సంబంధించి తెలిసిన విషయాలన్నింటినీ చెప్పాలని వారు సూచించారు.
బెంగళూరు సీబీఐ కార్యాలయం నుంచి సోమవారం తనకు ఈ మేరకు వర్తమానం అందిందని జడ్జి రామకృష్ణ ‘ఈనాడు’కు తెలిపారు. జస్టిస్ ఈశ్వరయ్యకు, తనకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలుగా పేర్కొంటూ వాటి రికార్డుతో కూడిన పెన్‌డ్రైవ్‌ను జడ్జి రామకృష్ణ గతంలో హైకోర్టుకు సమర్పించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం... 'హైకోర్టు సీజే, సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై కుట్రకు పథకం వేసినట్లు పెన్‌డ్రైవ్‌లోని సంభాషణల ద్వారా వెల్లడవుతోంది. హైకోర్టు సీజేకు వ్యతిరేకంగా రాష్ట్రపతికి పిటిషన్ పంపి తీవ్రమైన కుట్ర పన్నినట్లు స్పష్టమవుతోంది. ఈ సంభాషణల్లో వాస్తవికతను తేల్చేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌వీ రవీంద్రన్‌తో విచారణకు ఆదేశిస్తున్నాం. ఆయనకు సీబీఐ డైరెక్టర్, ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్లు దర్యాప్తులో సహకరించాలి' అని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జస్టిస్ ఆర్‌వీ రవీంద్రన్ విచారణను వేగవంతం చేశారు. ఆయనకు సహకరించేందుకు సీబీఐ డైరెక్టర్ ఒక ఎస్పీని కూడా కేటాయించారు. ఈ నేపథ్యంలో జడ్జి రామకృష్ణ మంగళవారం ఆయన ఎదుట విచారణకు హాజరుకానున్నారు.