Delhi liquor scam:దిల్లీ మద్యం ముడుపుల కేసులో హైదరాబాద్‌కు చెందిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్‌ను సీబీఐ అరెస్టు రాష్ట్రంలో సంచలనం రేపింది. మద్యం విధాన రూపకల్పనలో కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూరేలా రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పీ వ్యవహరించిందనే అభియోగాలున్నాయి. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని అభిషేక్‌ను సీబీఐ అధికారులు ఆదివారం దిల్లీకి పిలిపించారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు.
దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట సోమవారం హాజరుపరిచారు. విచారణలో అభిషేక్ తమ ప్రశ్నలకు సమాధానాలివ్వకుండా దాటవేశాడని.. అతడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు అయిదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని సీబీఐ అధికారులు కోరారు. మూడు రోజుల కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో అరుణ్ రామచంద్రన్ పిళ్లై నిందితుడిగా ఉన్నాడు. ఆయన డైరెక్టర్‌గా ఉన్న రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పీ సంస్థతోపాటు ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. రాబిన్ డిస్ట్రిబ్యూషన్‌లో అరుణ్‌తోపాటు బోయినపల్లి అభిషేక్ కూడా డైరెక్టర్‌గా ఉన్నట్లు బయటపడింది.
దీంతో అభిషేక్ వ్యాపారాలు, కార్యకలాపాలపైనా సీబీఐ అధికారులు దృష్టిసారించారు. మనీశ్ సిసోదియా అనుచరుడు అర్జున్‌పాండేకు విజయ్ నాయర్ తరఫున మహేంద్రు రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల నగదును అందజేశాడన్నది సీబీఐ అభియోగం. ఈ డబ్బులో కొంత పిళ్లైదని అనుమానిస్తున్నారు. ఈ కేసులో రామచంద్రన్ పిళ్లైని కాకుండా.. అనూహ్యంగా అభిషేక్‌ను అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. బోయినపల్లి అభిషేఖ్‌కు రాష్ట్రంలో ఉన్న సంబంధాల దృష్ట్యా వ్యూహాత్మకంగానే సీబీఐ అరెస్టు చేసినట్లు భావిస్తున్నారు. అభిషేక్ వ్యాపారాలకు సంబంధించి సీబీఐ, ఈడీలు ఇప్పటికే సమాచారం సేకరించాయి.