దృఢ సంకల్పంతో అమరావతి రైతులు తలపెట్టిన 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' కార్యక్రమం అనేక అవరోధాలను దాటుకుని పూర్తైంది. మంగళగిరిలోని పానకాలస్వామి గుడిలో తుళ్లూరు మహిళలు పూజలు చేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని స్వామివారిని మెుక్కుకున్నారు.
ఉక్కుపాదం మోపే చర్యలన్నింటినీ అధిగమించిన రాజధాని రైతులు మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకోగలిగారు. వారు తలపెట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానానికి’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఆలయం చుట్టూ ఇనుప కంచెలు వేసేసి.. భారీగా పోలీసుల్ని మోహరించినా... అన్నింటినీ దాటుకుని 20 మందికి పైగా రైతులు దఫదఫాలుగా ఆలయంలోకి చేరుకోగలిగారు. పోలీసులు గుడి లోపలే వారిని అదుపులోకి తీసుకుని ఈడ్చుకుంటూ తీసుకొచ్చి మరీ వాహనాల్లో కుక్కేశారు. ఓ మహిళనైతే కాళ్లు చేతులు లాగేసి లాక్కెళ్లిపోయారు. తొలుత కొందరు రాజధాని రైతులు కొండపైనున్న పానకాలస్వామి ఆలయం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. వారిని పోలీసులు ఘాట్‌రోడ్డు కిందే అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఉద్యమకారులు పలువురిని ఆ ఘాట్‌రోడ్డు వద్ద అడ్డుకోగా.. వారికి, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రాజధాని రైతులు ఒక్కొక్కరుగా విడిపోయి సాధారణ భక్తుల మాదిరిగా కొండ దిగువనున్న లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోకి చేరుకున్నారు. ఆలయంలోకి చేరుకుని నినాదాలు చేసిన ఓ మహిళా రైతును పోలీసులు కర్కశంగా ఈడ్చుకొచ్చేశారు. ‘మా భూముల్ని తీసుకుని... మాపైనే దౌర్జన్యం చేస్తారా’ అంటూ ఆమె కన్నీరుమున్నీరయ్యారు. మరో మహిళా రైతునూ ఇలాగే ఈడ్చేశారు. గుంటూరు ప్రాంతాల నుంచి మంగళగిరికి చేరుకునే వారి కోసం కాజ టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేయించారు. మంగళగిరి పట్టణంలో అణువణువునా పహారా కాశారు. ఆదివారం కావడంతో మంగళగిరిలోని పానకాల స్వామి, లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు ఆయా ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పోలీసులు తీవ్ర ఆంక్షలు అమలు చేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆయా వీధులకు చెందిన ప్రజలు మధ్యాహ్నం 2 గంటల వరకూ ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు.