రాజధాని గ్రామం కృష్ణాయపాలెంలో రెవెన్యూ అధికారుల ఎదుట నిరసన తెలిపిన రైతులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం.. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని వెల్లడిస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 426 మందిపై కేసులు పెట్టి రైతాంగాన్ని భయభ్రాంతులకు గురి చేయాలని సర్కారు భావిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే ఈ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన భూములను ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరించకనే రైతులు నిరసన తెలిపారన్నారు. మూడు రాజధానుల ప్రకటన వచ్చినప్పటి నుంచి రైతుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో కేసులు పెట్టడం లాంటి చర్యలు పుండు మీద కారం చల్లినట్లు అవుతుందన్నారు. శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న రైతులతో... ప్రభుత్వం చర్చించకుండా కేసులు పెట్టడం లాంటి చర్యలకు దిగడం అప్రజాస్వామికం అవుతుందన్నారు. రాజధాని కోసం పోరాడుతోన్న వారికి జనసేన బాసటగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
'అమరావతి రైతులపై కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి'
అమరావతిలోని కృష్ణాయపాలెం రైతులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని జనసేనాని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయకపోగా కేసులు పెట్టడం లాంటి చర్యలు పుండు మీద కారం చల్లినట్లు అవుతుందన్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తోన్న వారిపై కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.
pawan kalyan