Illegal arrests: ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు, తనిఖీలు, సోదాలు, అరెస్టుల పేరిట ఠారెతిస్తున్నారు. నోటీసులిచ్చేందుకు రాత్రివేళ ఇళ్లలోకి వెళ్లటం, తలుపులు విరగ్గొట్టడం, చీకటిపడ్డాక నిర్బంధించటం, థర్డ్ డిగ్రీ ప్రయోగం తదితర చర్యలకు పాల్పడుతున్నారు. వీరిని అడ్డం పెట్టుకుని వైకాపా ప్రభుత్వం తమకు గిట్టని వారిపై వేధింపులకు తెగబడుతోంది. పోలీసులు అక్రమంగా అరెస్టు చేయొచ్చా? విచక్షణరహితంగా కొట్టొచ్చా? వారికి చట్టనిబంధనలు వర్తించవా? ఎంత వేధించినా మౌనంగా భరించాల్సిందేనా? అంటే.. కాదంటున్నారు న్యాయ నిపుణులు. అరెస్టయిన వారికీ హక్కులుంటాయనీ, పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
విచక్షణాధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ అరెస్టులు:ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో నిందితుల్ని అరెస్టు చేయాలా, వద్దా అనే విచక్షణాధికారం దర్యాప్తు అధికారిదే. దాన్ని దుర్వినియోగం చేయకుండా సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో మార్గదర్శకాలిచ్చింది. అయినా అధికార పార్టీకి గిట్టని వారిని, ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించేవారిని అక్రమంగా అరెస్టు చేయటానికి ఈ విచక్షణాధికారాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు. ఇందుకోసం సీఆర్‌పీసీ 41ఏ నోటీసుల్ని పోలీసులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
* నోటీసులిస్తే తీసుకోవటానికి నిరాకరించారంటూ ఆ వ్యక్తిని, కుటుంబసభ్యుల్ని భయపెడుతున్నారు. ఇది చట్టవిరుద్ధం. నోటీసులు తీసుకోవటానికి నిరాకరిస్తే పోలీసులు మధ్యవర్తుల సమక్షంలో పంచనామా నిర్వహించి దాన్ని వీడియో చిత్రీకరించి వచ్చేయాలి. లేదా ఆ వ్యక్తి శాశ్వత చిరునామా వద్ద మధ్యవర్తుల సమక్షంలో నోటీసు అతికించి ఆ దృశ్యాలు తీసుకోవాలి.
* నోటీసుల్లో పేర్కొన్న మేరకు విచారణకు హాజరైన వ్యక్తిని రోజంతా కూర్చోబెడుతున్నారు. చివరిలో కాగితాలపై పోలీసు అధికారులకు నచ్చినది రాసుకుని వాటిపై సంతకం చేయాలని బలవంతం చేస్తున్నారు. ఫలానా వ్యక్తి చెప్పినందునే ఇలా చేశానని చెప్పాలంటూ బెదిరిస్తున్నారు.
* కొన్ని సందర్భాల్లో తెల్లవారుజామున లేచేసరికి నోటీసులిచ్చి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశానికి ఉదయం 10 గంటకల్లా విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తున్నారు. ఇది చెల్లదు. 41ఏ నోటీసులిచ్చి విచారణకు రమ్మన్నప్పుడు అందుకు తగిన సమయం ఇవ్వాలి.
* 41ఏ నోటీసులిస్తామంటూ స్టేషన్‌కు పిలిపించి అక్కడ బెదిరిస్తున్నారు.
* వృద్ధులు, చిన్నారులు, మహిళల్ని సాక్షులుగా విచారించాలంటే వారున్న చోటకే వెళ్లాలి. కానీ స్టేషన్‌కు పిలిపిస్తున్నారు.
* 41ఏ నోటీసుల్లో పేర్కొన్న నిబంధనలకు సంబంధిత వ్యక్తి కట్టుబడి ఉండకపోతే.. మేజిస్ట్రేట్ అనుమతితోనే పోలీసులు అరెస్టు చేయాలి. ఈ నిబంధనా పాటించడం లేదు.
కోర్టు ధిక్కరణ..
* ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ఎవరినైనా అరెస్టు చేయాలంటే దర్యాప్తు అధికారి ఆధారాలతో సహేతుక కారణాలు చెప్పాలి. సరైన కారణం చూపకుండా అరెస్టు చేస్తే.. ఆ అధికారిపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయొచ్చు. శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల్ని కోరవచ్చు.
* సీఆర్‌పీసీ 41ఏ నోటీసులివ్వకుండా దర్యాప్తు అధికారి ఎవరినైనా అరెస్టు చేసి హాజరుపరిస్తే సంబంధిత మేజిస్ట్రేట్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. యాంత్రికంగా రిమాండు విధిస్తే ఆ మేజిస్ట్రేట్‌పైనా కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయొచ్చు. శాఖాపరమైన చర్యలు కోరవచ్చు.
దురుసుగా ప్రవర్తించటానికి వీల్లేదు
కస్టడీలో తీసుకున్న ఎవరిపైనయినా పోలీసులు దురుసుగా ప్రవర్తించటానికి వీల్లేదని ‘డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్’ కేసులో సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అరెస్టు చేసేటప్పుడు పోలీసులు పాటించాల్సిన మార్గదర్శకాల్ని నిర్దేశించింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం సీఆర్‌పీసీ చట్టాన్ని సవరించి కొత్తగా పలు సెక్షన్లు జోడించింది.
* నేమ్ బ్యాడ్జి: ఎవరినైనా అరెస్టు చేస్తున్నప్పుడు, విచారిస్తున్నప్పుడు పోలీసు అధికారి.. తన పేరు, హోదా స్పష్టంగా కనిపించేలా నేమ్ బ్యాడ్జి తప్పనిసరిగా ధరించాలి. సంబంధిత అధికారుల వివరాలన్నీ రిజిస్టర్‌లో రాయాలి.
* అరెస్టు మెమో- సాక్షి సంతకం:అరెస్టు చేసిన తేదీ, సమయం, స్థలం వివరాలతో మెమో రూపొందించాలి. దానిపై అరెస్టయిన వ్యక్తి బంధువులు/ స్థానికంగా ఉండే పెద్దమనుషుల్లో ఒకరితో సాక్షి సంతకం తీసుకోవాలి. అరెస్టయిన వ్యక్తి కౌంటర్ సంతకమూ ఉండాలి. అరెస్టు వివరాలు, ఆ సమాచారాన్ని పోలీసులు ఎవరికి తెలియజేశారు? ఆ వ్యక్తి ఎవరి కస్టడీలో ఉన్నారో స్టేషన్ డైలీ డైరీలో నమోదు చేయాలి.
* గాయాల రికార్డు- ఇన్‌స్పెక్షన్ మెమో:తన శరీరంపై గాయాల్ని రికార్డు చేయాలని అరెస్టయిన వ్యక్తి పోలీసు అధికారిని కోరితే.. పరీక్షించి ఆ వివరాలన్నింటినీ నమోదు చేయాలి. దీన్ని ఇన్‌స్పెక్షన్ మెమో అంటారు. దానిపై అరెస్టయిన వ్యక్తి, పరీక్షించిన అధికారీ సంతకాలు పెట్టాలి. ప్రతిని సదరు వ్యక్తికి తప్పనిసరిగా ఇవ్వాలి.
* అరెస్టు సమాచారం చేరవేత:అరెస్టు సమాచారాన్ని కుటుంబసభ్యులు/బంధువులు/ స్నేహితులకు తెలియజేయాలని ఆ వ్యక్తి కోరితే పోలీసు అధికారి తప్పనిసరిగా చేయాలి. జిల్లా న్యాయ సహాయ కమిటీలకూ ఈ సమాచారాన్ని తెలియజేయాల్సిందే.
* కంట్రోల్ రూమ్- నోటీసుబోర్డు:అరెస్టయిన వ్యక్తులు, వారిని ఎక్కడ నిర్బంధించారో అరెస్టు చేసిన 12 గంటల్లోగా దర్యాప్తు అధికారి పోలీసు కంట్రోల్‌రూమ్‌కు తెలియజేయాలి. దాన్ని అన్ని కంట్రోల్ రూమ్‌ల్లోనూ నోటీసు బోర్డుపై స్పష్టంగా ప్రదర్శించాలి.