రాష్ట్రానికి రాజధానిని నిర్ణయించుకునేది రాష్ట్ర ప్రభుత్వమేనని కేంద్రం పేర్కొంది. ఆ ప్రక్రియలో తమకు ఎలాంటి పాత్రా ఉండబోదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015 ఏప్రిల్ 23న రాజధానిగా అమరావతిని నోటిఫై చేస్తూ ఉత్తర్వులిచ్చిందని తెలిపింది. ప్రస్తుత ప్రభుత్వం 2020 జులై 31న పాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చట్టాన్ని గెజిట్‌లో నోటిఫై చేసిందని పేర్కొంది. ఏపీకి 3 రాజధానులుంటాయని ఆ చట్టంలో రాష్ట్రం పేర్కొన్నట్లు కేంద్రం తెలిపింది.
రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేసేలా.. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ పోలూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి 2019లో హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దానిపై హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం తరఫున హోంశాఖ అండర్ సెక్రటరీ లలిత టి.హెదావూ గురువారం అఫిడవిట్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం మరోసారి తేల్చేసింది. రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ సందర్భంగా అప్పటి ప్రధాని రాజ్యసభలో ఇచ్చిన హామీలు, వాటి అమలుకు సంబంధించి తాజా పరిస్థితిని వివరించే పత్రాలను అఫిడవిట్‌కు జత చేసింది. 3 రాజధానులపై ఏపీ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన చట్టం ప్రతులు, విభజన చట్టంలోని సెక్షన్ 94-2, 3, 4 కింద కేంద్రం ఇప్పటివరకూ విడుదల చేసిన నిధుల జాబితాను అఫిడవిట్‌కు జత చేసింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని శ్రీనివాసరావు వేసిన వ్యాజ్యాన్ని కొట్టివేయాలని కోరింది.
అఫిడవిట్‌లో ముఖ్యాంశాలు..
ప్రత్యేక హోదా ఎందుకివ్వలేదంటే..
కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌లో పలు అంశాలపై వివరణ ఇచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని జాతి విస్తృత కోణంలో చూడాలి. హోదా ఉన్న, లేని రాష్ట్రాల మధ్య ఎలాంటి వ్యత్యాసాన్నీ 14వ ఆర్థిక సంఘం చూపించలేదు. ఒక రాష్ట్రానికి వనరుల లోటుంటే.. దాన్ని పన్నుల్లో వాటా ద్వారా భర్తీ చేయాలని ఆర్థిక సంఘం తెలిపింది. ఒకవేళ అప్పటికీ లోటు భర్తీ కాని రాష్ట్రాలకు ప్రత్యేకంగా రెవెన్యూ లోటు భర్తీకి నిధులివ్వాలని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లలో రెవెన్యూ లోటు కింద రూ.22,113 కోట్లు చెల్లించాలని ఆర్థిక సంఘం సూచించింది. దాని ప్రకారం 2015-16 నుంచి 2019-20 మధ్య కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 90 శాతం నిధులను కేంద్రం భరించడం ద్వారానూ, విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టుల్లో రుణం, వడ్డీని కేంద్రమే చెల్లించడం ద్వారానూ రాష్ట్రానికి మరింత ఆర్థిక ప్రయోజనం చేకూర్చేందుకు కేంద్రం ముందుకొచ్చింది.
- 2014 జూన్ రెండో తేదీ నుంచి 2015 మార్చి 31 మధ్ ఆంధ్రప్రదేశ్‌కు వనరుల లోటు రూ.4,117.89 కోట్లుగా అంచనా వేసి దానిలో రూ.3979.50 కోట్లు కేంద్రం విడుదల చేసింది.
పోలవరం ప్రాజెక్టుపై...