Amaravathi farmers: అమరావతిపై హైకోర్టు తీర్పుతో రాజధాని గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇన్నాళ్లు రైతుల మోముల్లో కనిపించిన ఆవేదన తొలగి సంతోషం వెల్లివిరిసింది. తీర్పు వెలువడగానే శిబిరాల్లో రైతులు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. భారీగా బాణసంచా కాల్చి, సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఆకుపచ్చ కండువాలు చేతపట్టి నినాదాలతో హోరెత్తించారు. మహిళా రైతులు రంగులు పూసుకుని ఆనందాన్ని పంచుకున్నారు. మరికొందరు ఆనందబాష్పాలతో ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం కనిపించింది. రాజధాని అమరావతిపై దాఖలైన వ్యాజ్యాల్లో గురువారం ఉదయం హైకోర్టు తీర్పు వెలువరుస్తుందనే సమాచారంతో ఇళ్లలోనూ, శిబిరాల్లోనూ రైతులు, మహిళలు, రైతు కూలీలు ఉత్కంఠగా ఎదురుచూశారు. తీర్పు అనుకూలంగా రాగానే ఇళ్లలో టీవీల ముందు చప్పట్లు కొడుతూ కనిపించారు. శిబిరాల్లో జై అమరావతి నినాదాలు మిన్నంటాయి.
హైకోర్టు వద్ద సాష్టాంగ నమస్కారం
తీర్పు వెలువడిన తర్వాత రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలు ఉదయం హైకోర్టు ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి కృతజ్ఞతలు తెలిపారు. మోకాళ్లపై నిల్చుని రెండు చేతులు జోడించి నమస్కరించారు. మహిళలు హైకోర్టుకు హారతులిచ్చారు. ముస్లిం మహిళలు, రైతులు మోకాళ్లపై నిల్చుని కృతజ్ఞతలు తెలిపారు. న్యాయాన్ని కాపాడిన న్యాయదేవతకు వందనం అని నినాదాలు చేశారు. న్యాయవాదులంతా హర్షం వ్యక్తం చేశారు. సాయంత్రం హైకోర్టు వద్దకు రైతులు, మహిళలు భారీగా చేరుకున్నారు. హైకోర్టు వద్ద నుంచి సీడ్‌యాక్సిస్ రహదారి వరకు రోడ్డుకు ఇరువైపులా మానవహారంలా నిల్చుని ఆ రోడ్డులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెళ్లే వరకు వేచి ఉండి రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. కొంతమంది రైతులు మోకాళ్లపై నిల్చుని ధన్యవాదాలు తెలిపారు.