రాజధాని అమరావతి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అమరావతి రాజధాని ఐకాస నేతలు డిమాండ్ చేశారు. గుంటూరులో సమావేశమైన నేతలు.. హైకోర్టు తీర్పు నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. బడ్జెట్లో అమరావతికి నిధులు కేటాయించలేదని వారు ఆసహనం వ్యక్తం చేశారు. కేవలం రాజధాని ప్రాంత రైతులే కాకుండా.. రాష్ట్ర ప్రజలంతా అమరావతే రాజధానిగా కొనసాగాలని ఆకాంక్షించారన్నారు. హైకోర్టు కూడా అమరావతికి అనుకూలంగా తీర్పునిచ్చిందని గుర్తు చేశారు.
సేవ్ అమరావతి నినాదం ఇకపై బిల్డ్ అమరావతిగా మారుస్తున్నట్లు నేతలు స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పును అమలు చేయటంతో పాటు రాజధానిలో వెంటనే అభివృద్ధి పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజధాని గ్రామాల్లో దీక్షా శిబిరాలు కొనసాగిస్తామని.. ప్రభుత్వం పనులు మొదలుపెట్టాకే ఐకాస చర్చించి నిర్ణయం తీసుకుంటుందని నేతలు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఐకాస కన్వీనర్ పువ్వాడ సుధాకర్‌రెడ్డి, రాజధాని గ్రామాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
రాజధాని నిర్మాణానికి బడ్జెట్లో కేటాయింపులు శూన్యం..
అమరావతిపై హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం తుంగలో తొక్కింది. బడ్జెట్లో అమరావతికి చేసిన కేటాయింపులు చూస్తే హైకోర్టు చెబితే మేం వినేదేంటనే వైఖరి ప్రదర్శించింది. రాజధానిలో నెల రోజుల్లో మౌలిక వసతుల నిర్మాణం పూర్తి చేయాలని.. 3 నెలల్లో రైతులకు లేఅవుట్లు అభివృద్ధి చేసి స్థలాలు అప్పగించాలనిహైకోర్టు తీర్పు ఇచ్చింది. మాస్టర్‌ప్లాన్‌ను అనుసరించి 6 నెలల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వానికి విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అధికారంలోకి రాగానే అమరావతి పనులు నిలిపివేసిన ప్రభుత్వం.. కోర్టు తీర్పు తర్వాత కూడా తీరు మార్చుకోలేదు. అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధికి 2022-23 వార్షిక బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడమే దీనికి నిదర్శనం. బడ్డెట్ అంకెల్లో మాత్రం 1329.21 కోట్లు కేటాయించినట్టుగా చూపించి కనికట్టు చేసింది. అందులో 800 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయంగా వస్తుందని ఊహించి పెట్టింది.
బడ్జెట్ కేటాయింపుల్లో సీఆర్డీఏకి సాయం పేరుతో రూ. 200 కోట్లు కేటాయించింది. అది పూర్తిగా గతంలో రాజధాని నిర్మాణం కోసం హడ్కో, ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీలు, అసలు చెల్లించేందుకు ఉద్దేశించింది. వడ్డీలు, అసలు చెల్లించడానికీ ఆ నిధులు సరిపోని పరిస్థితి. 2021-22 బడ్జెట్లో సవరించిన అంచనాల ప్రకారం రుణాలపై వడ్డీలు, అసలు చెల్లించేందుకు సంవత్సరానికి రూ. 550 కోట్లు కావాలి. కానీ బడ్జెట్లో రూ. 200 కోట్లే చూపించారు. 'రాజధాని ప్రాంత సామాజిక భద్రతా నిధి' పేరుతో మరో రూ. 121.11 కోట్లు ప్రతిపాదించారు.