ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Cannabis cases in Telangana : హైదరాబాద్​లో ఇంటికే డ్రగ్స్.. బాధితులే స్మగ్లర్స్! - drugs supply in Hyderabad

భాగ్యనగరంలో యువత మత్తుకు బానిసవుతున్నారు. కోరుకుంటే ఇళ్లకే చేరుతున్న డ్రగ్స్​లో మునిగితేలుతున్నారు. పోలీసులు, ఆబ్కారీ అధికారులు ఎంత కట్టడి చేసినా.. ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతోంది. కొన్నిసార్లు బాధితులే స్మగ్లర్లుగా మారుతున్నారు. రెండేళ్ల వ్యవధిలో నగరంలో గంజాయికి అలవాటు పడిన 2వేల మంది విద్యార్థులను ఆబ్కారీ శాఖ గుర్తించింది.

Cannabis cases in Telangana
Cannabis cases in Telangana

By

Published : Oct 1, 2021, 12:50 PM IST

హైదరాబాద్​లో వివిధ రకాల మత్తుపదార్థాలు కోరుకుంటే ఇళ్లకు చేరుతున్నాయి. మహానగరంలో ఏటేటా మత్తుపదార్థాల వినియోగం పెరుగుతోంది. పోలీసులు, ఆబ్కారీశాఖలు సమన్వయంతో ప్రత్యేక దాడులు చేస్తున్నా ఫలితాలు కన్పించడం లేదు. కొద్దిరోజుల వ్యవధిలోనే నగర పరిధిలో సుమారు 100 మందిపై కేసులు నమోదు చేసినట్టు సమాచారం. దూల్‌పేట్‌, నానక్‌రామ్‌గూడ, కూకట్‌పల్లి, నిజాంపేట్‌ తదితర ప్రాంతాలు కేంద్రాలుగా భారీఎత్తున గంజాయి వ్యాపారం విస్తరించింది. బాధితులే స్మగ్లర్లుగా మారుతున్నారు. విశాఖపట్టణం, ఒడిశా, వరంగల్‌ తదితర ఏజెన్సీల నుంచి నగరానికి దిగుమతి అవుతోంది.

రెండు వేల మంది గుర్తింపు..

ఆబ్కారీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ యంత్రాంగం రెండేళ్ల వ్యవధిలో గంజాయికి అలవాటు పడిన 2 వేల మంది విద్యార్థులను గుర్తించారు. 400 మందికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. 200-300 మందికి పునరావాస కేంద్రాల్లో చికిత్స అందించి సాధారణ స్థితికి తీసుకువచ్చారు. ప్రస్తుతం గ్రేటర్‌ పరిధిలోని ప్రభుత్వ/ప్రైవేటు రిహాబిలిటేషన్‌ కేంద్రాల్లో 1200-1400 మంది చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.

ఇంటి వాతావరణమే కారణం

మత్తు నుంచి బయటపడిన 300 మందిలో 70 శాతం ఇంటికి దూరంగా, ఒంటరిగా ఉండటం/అమ్మనాన్నలు విడిపోవటం వంటి కారణాలతో మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డట్లు అధికారులకు వివరించారు.

ఆకర్షణకు కారణాలు

  • దమ్ము కొడితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఉత్సాహం.
  • తక్కువ రేటుకే అందుబాటులో ఉండటం.
  • గంజాయి ఆరోగ్యానికి హానిచేయదనే అపోహ.
  • స్నేహితులతో ఇతర ప్రాంతాలకు విహారయాత్రలు.
  • చెడుస్నేహాలు, తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ స్వేచ్ఛగా భావించటం.

యువతా తెలుసుకో..

ఎక్కువసార్లు తీసుకుంటేనే బానిస అవుతామనేది అపోహ. ఒక్కసారి రుచిచూసి వదిలేద్దామనుకోవద్ధు ఆ ఒక్కసారే బానిసలుగా మార్చే అవకాశముంది. మత్తుపదార్థాలు సృజనాత్మకత, ఏకాగ్రత పెంచుతాయనేది అసత్యం. మొదటి డ్రగ్‌ డోస్‌ అమ్మకందారుల నుంచి రాదు. స్నేహితుల ఒత్తిడితోనే మొదలవుతుందని గుర్తుంచుకోవాలి.

తల్లిదండ్రులు జరభద్రం

  • ఎలాంటి స్నేహితులతో తమ పిల్లలు తిరుగుతున్నారనేది కన్నవారు స్పష్టమైన అవగాహనతో ఉండాలి.
  • మిత్రులతో కలసి ఆస్వాదించే వేడుకల విషయంలో అప్రమత్తంగా మెలగాలి.
  • తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా గోవా, అరకు వంటి ప్రాంతాలకు యువతను పంపొద్ధు
  • విచ్చలవిడిగా ఖర్చుపెట్టేంత డబ్బు అందుబాటులో ఉంచొద్ధు
  • పిల్లలకు వచ్చే పాకెట్‌మనీ ఖర్చుపై స్పష్టత ఉండాలి.
  • విద్యార్థుల బ్యాగ్‌ల్లో ఓసీబీ పేపర్స్‌, లైటర్స్‌, ఐ డ్రాప్స్‌ తదితర వస్తువులు గమనించినట్లయితే గంజాయి తాగుతున్నట్లు అర్థం. అధిక ఆకలి, అతి నిద్ర గమనిస్తే అప్రమత్తమవ్వాలి. గంజాయికి అలవాటుపడిన ప్రథమ దశలో లక్షణం కనిపిస్తుంది
  • గంజాయి/మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వారు తరచూ కోప్పడటం, ఎదురు తిరగటం, విపరీత ధోరణలు ప్రదర్శిస్తుంటారు. మత్తుకు అలవాటుపడినట్లు గుర్తించి నిర్ధారించుకుంటే వైద్యచికిత్స/రీహాబిలిటేషన్‌ ఇప్పించటంతో పాటు కన్నవారి మద్దతుతో తేలికగా బయటపడేయవచ్ఛు.

40 కిలోల పట్టివేత

నల్గొండ జిల్లా చిట్యాల హైవేపై చిట్యాల పోలీసులకు 16కిలోల గంజాయి, ముగ్గురు వ్యక్తులు పట్టుబడినట్లు నార్కట్‌పల్లి సీఐ శంకర్‌రెడ్డి తెలిపారు. గురువారం చిట్యాలలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్‌ జిల్లా భుక్తాపూర్‌కు చెందిన ఎండీ ఉస్మాన్‌ఖాన్‌, హనుమాన్‌నగర్‌కు చెందిన ఆదె ప్రేమ్‌, ఉట్నూర్‌కు చెందిన ఎండీ షకీల్‌ ముఠాగా ఏర్పడి గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నారు. విశాఖ జిల్లా సీలేరుకు చెందిన రవి నుంచి 16కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. ఆర్టీసీ బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరారు. చిట్యాల రైల్వేస్టేషన్‌కు వెళ్లేదారిలో ఎస్సై రావుల నాగరాజు ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా చూసి బస్సు దిగి రైల్వేస్టేషన్‌వైపు పరుగులు పెట్టారు. వారిని వెంబడించి పట్టుకోగా గంజాయి లభ్యమైంది. వైజాక్‌ నుంచి హైదరాబాద్‌కు బస్సులో 24 కిలోల గంజాయిని తరలిస్తున్న కందిపాటి సౌజన్య, కొర్ర కృష్ణలను నార్కట్‌పల్లి పోలీసులు గురువారం తెల్లవారుజామున పట్టుకున్నట్లు ఎస్సై యాదయ్య తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details