ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వలస ఓటర్లపై అభ్యర్థుల వల... వాహనాలు, టికెట్లు సమకూరుస్తున్న అభ్యర్థులు

ప్రతి ఓటూ కీలకమైన తరుణంలో పంచాయతీ ఎన్నికల బరిలోని అభ్యర్థులు వలస ఓటర్లపై కన్నేస్తున్నారు. ఉపాధి, ఉద్యోగాల కోసం పల్లెలను వదిలి నగరాలు, పట్టణాలకు వెళ్లిన వారిని పోలింగ్‌ రోజు రప్పించేందుకు పోటాపోటీగా ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాలను పంపడంతోపాటు రైలు, బస్సు టికెట్లను సమకూర్చుతున్నారు. 3 రోజుల కూలీ కోల్పోతామన్న వారికి తదనుగుణంగానూ డబ్బులను ఇస్తామని హామీనిస్తున్నారు. దారిపొడవునా అతిథి మర్యాదలతో మెప్పించి మద్దతు పొందేందుకు ఎవరికి తోచిన రీతిలో వారు ప్రయత్నిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ ప్రతి జిల్లాలోనూ పలు పంచాయతీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్కో అభ్యర్థి రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు వెచ్చిస్తున్నారు.

candidates provide buses and trains for voters in cities and towns
పంచాయతీ ఎన్నికల దృష్ట్యా స్వస్థలాలకు పయనమైన ఓటర్లు

By

Published : Feb 13, 2021, 7:02 AM IST

* తూర్పుగోదావరి జిల్లాలోని ఓ పంచాయతీలో పోటీ ప్రతిష్ఠాత్మకంగా మారి హైదరాబాద్‌లో ఉన్న ఐదుగురు ఓటర్లను విమానంలో తీసుకొస్తున్నారు.

* చెన్నై, పారాదీప్‌లలో ఉన్న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ప్రాంతం వారు ఇక్కడినుంచి పంపిన టికెట్లపై రైలులో బయలుదేరారు. శనివారం ఉదయం వారు స్వగ్రామానికి చేరుకొని ఓటు వేయనున్నారు.

* కర్ణాటకలోని శివమొగ్గ, బళ్లారి ప్రాంతాలకు వలస వెళ్లిన అనంతపురం, కర్నూలు పశ్చిమ ప్రాంతం వారిని రప్పించేందుకు అభ్యర్థులు వాహనాలను సమకూర్చారు.

* ప్రకాశం జిల్లాలోని కందుకూరు తదితర ప్రాంతాలలో పొగాకు కూలీలుగా పనిచేస్తున్న గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని కొన్ని పంచాయతీల ఓటర్ల మద్దతు కోసం అభ్యర్థుల ప్రతినిధులు సరాసరి ఆయా గ్రామాలకు వెళ్లారు. వారు స్వగ్రామాలకు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రకాశం జిల్లాలోని కొన్ని పంచాయతీల్లో ఓటింగ్‌కు వచ్చినందుకు వలస కూలీలకు రానుపోను ఖర్చులతోపాటు రూ.2 వేలు, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటుచేశారు.

* రాజమహేంద్రవరం, కడియం ప్రాంతాల్లో ఉంటున్న విజయనగరంవాసులను రప్పిస్తున్నారు.

* ఒకే పంచాయతీకి చెందిన 30-40 మందికంటే మించి వలస ఓటర్లు ఒకే నగరంలో ఉంటే వారిని గ్రామాలకు రప్పించేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. పలు పంచాయతీల ఓటర్లు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు. వారిని గ్రామాలకు తీసుకెళ్లి తిరిగి పంపేందుకు ప్రైవేటు ట్రావెల్స్‌ బుక్‌ చేశారు. 40-45 మంది కూర్చునే సామర్థ్యమున్న బస్సుకు 1.20లక్షల నుంచి లక్షన్నర వెచ్చిస్తున్నారు.

గూగుల్‌పే.. ఫోన్‌పేల్లో చెల్లింపులు

కొందరు ఓటర్లకు గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా రానుపోను ప్రయాణ ఛార్జీలు, దారి ఖర్చులకు డబ్బులను అభ్యర్థులు పంపుతున్నారు. ఉభయగోదావరి జిల్లాలోని పలు పంచాయతీల్లో ఈ పరిస్థితి ఉంది. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలంలోని 2పంచాయతీలకు చెందిన ఓటర్లు ఒడిశాలోని పూరీ సమీప ప్రాంతాలకు వలస వెళ్లారు. వారిని రప్పించేందుకు కొందరు బస్సులు ఏర్పాటు చేయగా.. మరికొందరు రైలు రిజర్వేషన్‌ చేయించారు.

ఇదీచదవండి.

అరకు ఘాట్‌ రోడ్డులో ఘోర ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details