నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులు ఈరోజు పోటెత్తారు. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో పోటీకి నామపత్రాల సమర్పణకు ఇవాళ చివరిరోజు కావడంతో.. ఆశావహులు క్యూ కట్టారు. ప్రధాన పార్టీల మద్దతుతో పోటీకి దిగి.. సర్పంచి, వార్డు స్థానాలు సాధించడానికి బరిలోకి దిగారు.
కృష్ణాజిల్లాలో...
తిరువూరు మండలం గానుగపాడులో మాజీ సర్పంచ్ వేమిరెడ్డి నిర్మలమ్మ నామినేషన్ వేశారు. చీమలపాడులో జనసేన మద్దతుతో శొంటాల స్వరూపరాణి, ఎ. కొండూరు మండలం కేశ్యాతండాలో వైకాపా అండతో బరబల జమలమ్మ సర్పంచి అభ్యర్థులుగా నామపత్రాలు దాఖలు చేశారు. మునుకుళ్ల సర్పంచ్ అభ్యర్థిగా.. వైకాపా బలపరిచిన సిరికొండ కుమారి పోటీలో ఉన్నారు.
ఎ. కొండూరు మండలం రామచంద్రాపురం నుంచి సర్పంచి అభ్యర్థిగా తుళ్లూరు గోపాలరావు తెదేపా మద్దతుతో నామినేషన్ వేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి ర్యాలీగా తరలివచ్చారు. ఎంపీపీ అభ్యర్థి తాతా నాగమణి, మండల తెదేపా అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ వాసం మునియ్య, రాష్ట్ర పరిశీలకుడు శ్రీధర్ తదితరులు ఇందులో పాల్గొన్నారు.
గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో నామినేషన్లు జోరుగా కొనసాగాయి. మేజర్ పంచాయతీలైన గన్నవరం, బాపులపాడు, కేసరపల్లి, బుద్దవరం, తేలప్రోలు, పెద్దఅవుటపల్లి, వీరవల్లి సహా ఇతర పంచాయతీల్లోనూ నామినేషన్లు వేసేందుకు సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఉత్సాహం కనబరిచారు. ప్రధాన పార్టీలు తెదేపా, వైకాపా మద్దతిస్తున్న అభ్యర్థులు పలుచోట్ల భారీ ప్రదర్శనగా వెళ్లి నామపత్రాలు సమర్పించారు. ఒక్కోచోట సర్పంచి పదవికి ఐదుగురుకి పైగా పోటీలో నిలవడం చర్చనీయాంశంగా మారింది.
గుంటూరు జిల్లాలో...
నాలుగో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్‌కు ఇవాళ చివరి రోజు కావడంతో.. ప్రత్తిపాడులో అభ్యర్థులు క్యూ కట్టారు. పంచాయతీ కార్యాలయం వద్ద నామినేషన్ వేసేందుకు వచ్చిన సర్పంచి, వార్డు అభ్యర్థులను చూస్తే.. ఓట్లు వేసేందుకు వరుసలో నుంచున్నట్లు కనిపిస్తోంది. ప్రత్తిపాడు, పెదనందిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రత్తిపాడు పంచాయతీ వద్ద నామినేషన్ ప్రక్రియను గుంటూరు అర్బన్ అదనపు ఎస్పీ గంగాధరం పరిశీలించారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు.
నాలుగో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందడిగా సాగుతోంది. నామపత్రాల సమర్పణకు ఇవాళ చివరి రోజు కావడంతో.. అభ్యర్ధులు భారీగా తరలివస్తున్నారు. గుంటూరు జిల్లా పరిధిలోని 16 మండలాల్లో 266 పంచాయతీలు, 2,810 వార్డులకు ఈ నెల 21న ఎన్నికలు జరగనున్నాయి. పోటీ చేస్తున్న అభ్యర్ధులు తమ మద్ధతుదారులతో వచ్చి ఎన్నికల అధికారులకు నామినేషన్లు అందజేస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో...
ముమ్మడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం మండలాల్లోని 46 పంచాయతీలతో పాటు 522 వార్డు స్థానాలకు నామినేషన్లు సమర్పించేందుకు అభ్యర్థులు పోటెత్తారు. నిన్న అమావాస్య కావడంతో అభ్యర్థులందరూ ఈరోజే నామ పత్రాల సమర్పణకు ముహూర్తాలు పెట్టుకున్నారు. అందరూ ఒకేసారి రావడంతో వారిని నిలువరించడానికి తగిన స్థాయిలో పోలీసులు లేక.. నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగా రిటర్నింగ్ అధికారి వద్దకు వెళుతున్నారు. తమకు మద్దతుగా వచ్చిన వారికి అభ్యర్థులు విందు భోజనాలు ఏర్పాటు చేశారు.
అమలాపురం డివిజన్లో నామినేషన్ కేంద్రాలు కోలాహలంగా మారాయి. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో పోటీకి నామపత్రాలు దాఖలుకు ఇవాళ చివరి రోజు కావడంతో.. కొత్తపేట, ఆత్రేయపురం, రావులపాలెం మండలాల్లోని అభ్యర్థులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. 273 పంచాయతీలకు వందల సంఖ్యలో నామ పత్రాలు దాఖలయ్యాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
నాలుగో విడత స్థానిక ఎన్నికలకు నామినేషన్లు వేసేందుకు ఇవాళ చివరి రోజు కావడంతో.. కోనసీమలో భారీ బైక్ ర్యాలీలు జరిగాయి. అభ్యర్థులు ఊరేగింపులతో నామినేషన్ వేసేందుకు తరలివచ్చారు. ఆత్రేయపురం, రావులపాలెంలో సర్పంచ్ అభ్యర్థులతో కలిసి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి నామినేషన్ కేంద్రానికి వెళ్లారు. ఎన్నికల అధికారులకు పలువురు నామపత్రాలు సమర్పించారు.
విశాఖ జిల్లాలో...
పద్మనాభం మండలంలో పంచాయతీ పోరు రసవత్తరంగా సాగనుంది. అధికార పార్టీ ఏకగ్రీవాలు కోసం ప్రయత్నిస్తుండగా.. ప్రతిపక్ష తెదేపా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధపడుతోంది. మండలంలోని 22 పంచాయతీల్లో వైకాపా అభ్యర్థులు పోటీ చేస్తుండగా... 20 స్థానాల్లో తెదేపా మద్దతుదారులను బరిలో నిలిపింది. నామినేషన్ల పర్వం నేటితో ముగియనున్న నేపథ్యంలో.. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు బలాబలాలు నిరూపించుకొనేందుకు భారీ ర్యాలీలతో నామినేషన్లు దాఖలు చేశారు. ఇటీవల జరిగిన శాశన సభ ఎన్నికల్లో తెదేపాకు ఇక్కడ ఎదురు దెబ్బ తగిలినా.. పంచాయతీ పోరులో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థులు దౌర్జన్యాలకు, ప్రలోభాలకు పాల్పడినా ఎదురొడ్డి విజయం సాధిస్తామని చెబుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో...