ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

92 ఇంజినీరింగ్‌ కళాశాలలపై చర్యలు

రాష్ట్రంలో 92 ఇంజినీరింగ్‌ కళాశాలల అనుమతుల రద్దుకు రంగం సిద్ధమైంది. గత మూడేళ్లుగా 25శాతంలోపు ప్రవేశాలున్న కళాశాలలు, 2018-19లో వసూలు చేసిన బోధన రుసుముల కంటే తక్కువ ఖర్చు చేసిన విద్యా సంస్థలపై చర్యలు తీసుకోనున్నారు. 25శాతం ప్రవేశాలు ఉన్నవి 47 ఉండగా.. మిగతా వాటిల్లో ఆదాయ, వ్యయాల్లో వ్యత్యాసం నెలకొంది.

Cancellation of licenses of 92 engineering colleges in the state Activity ready.
92 ఇంజినీరింగ్‌ కళాశాలలపై చర్యలు

By

Published : Oct 27, 2020, 9:03 AM IST

రాష్ట్రంలో 92 ఇంజినీరింగ్‌ కళాశాలల అనుమతుల రద్దుకు రంగం సిద్ధమైంది. గత మూడేళ్లుగా 25శాతంలోపు ప్రవేశాలున్న కళాశాలలు, 2018-19లో వసూలు చేసిన బోధన రుసుముల కంటే తక్కువ ఖర్చు చేసిన విద్యా సంస్థలపై చర్యలు తీసుకోనున్నారు. 25శాతం ప్రవేశాలు ఉన్నవి 47 ఉండగా.. మిగతా వాటిల్లో ఆదాయ, వ్యయాల్లో వ్యత్యాసం నెలకొంది. 2020-2021 నుంచి మూడేళ్లకు బోధన రుసుముల నిర్ణయం కోసం ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌కు కళాశాలలు సమర్పించిన ఆదాయ, వ్యయాల నివేదికల పరిశీలనలో ఇది బహిర్గతమైంది. కొన్ని కళాశాలల వ్యయం రూ.30వేలలోపే ఉన్నట్లు తేలింది. మరికొన్ని కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండగా.. వ్యయం ఎక్కువ చేసినట్లు, విద్యార్థులు ఎక్కువ ఉన్నా ఖర్చు తక్కువ చేసినట్లు ఆడిటింగ్‌లో తేలింది. దీనిపై సమగ్ర పరిశీలనకు వివరాలను విశ్వవిద్యాలయాలకు పంపించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్‌టీయూ) కాకినాడ పరిధిలోనే 65 కళాశాలలు ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య, వ్యయాలను పరిశీలించి నివేదిక పంపాలని వర్సిటీని ఉన్నత విద్య శాఖ ఆదేశించింది. మొదట 115 కళాశాలలతో జాబితా సిద్ధం కాగా.. దీన్ని ఆ తర్వాత 92కు కుదించారు.

అనుబంధ గుర్తింపు బకాయిలున్నా..

విశ్వవిద్యాలయాలకు ప్రైవేటు కళాశాలలు చెల్లించాల్సిన అనుబంధ గుర్తింపు రుసుముల బకాయిలున్న వాటిని కౌన్సెలింగ్‌ నుంచి తొలగించే అవకాశం ఉంది. జేఎన్‌టీయూ, కాకినాడ పరిధిలో రూ.180 కోట్లకుపైగా బకాయిలు ఉండగా.. జేఎన్‌టీయూ, అనంతపురంలో రూ.29కోట్లు ఉన్నాయి. బకాయిలు చెల్లించకపోతే అనుబంధ గుర్తింపు నిలిపివేస్తామని వర్సిటీలు ఆదేశాలు జారీ చేయడంతో కొన్ని కళాశాలలు చెల్లిస్తున్నాయి.

రెండు మూడు కళాశాలల్లో ఒకే అధ్యాపకుడు..

ఒక అధ్యాపకుడే రెండు, మూడు కళాశాలల్లో పని చేస్తున్నట్లు యాజమాన్యాలు చూపిస్తున్నాయి. అధ్యాపకులకు ఆధార్‌ నంబరు లింకు చేయడంతో ఈ విషయం బయటపడింది. జేఎన్‌టీయూ, అనంతపురం పరిధిలో 63కళాశాలల్లో ఈ పరిస్థితి ఉన్నట్లు గుర్తించారు. బోధన సిబ్బందికి సంబంధించి తప్పుడు లెక్కలు చూపించినందుకు వీటికి 10శాతం నుంచి 20శాతం వరకు సీట్లలో కోత వేయాలని వర్సిటీ భావిస్తోంది. ఈ వర్సిటీలో 25శాతంలోపు ప్రవేశాలున్న కళాశాలలు 18 ఉన్నట్లు తేలింది. వీటికి అనుబంధ గుర్తింపు నిలిపివేయనున్నారు. జేఎన్‌టీయూ, కాకినాడ మాత్రం ఇంతవరకు బోధన సిబ్బందిపై దృష్టి సారించలేదు.

కనీస బోధన రుసుము ఎంత?

ఇప్పటి వరకు కనీస బోధన రుసుమును నిర్ణయిస్తున్న కమిషన్‌ ఈసారి తొలగించే అవకాశం ఉంది. ఆదాయ, వ్యయాల ప్రకారం ఏ కళాశాలకు ఎంత రుసుము వస్తే అంతే నిర్ణయించాలని భావిస్తున్నట్లు తెలిసింది. విశ్వవిద్యాలయాల నుంచి కళాశాలల జాబితా ఈనెల 31లోపు కమిషన్‌కు చేరితే నవంబరు 2తర్వాత కమిషన్‌ బోధన రుసుముల ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది.


ఇదీ చదవండి:

కేంద్రం కొర్రీపై నవంబరు 2న అత్యవసర భేటీ

ABOUT THE AUTHOR

...view details