ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ముగిసిన గ్రేటర్ ఎన్నికల ప్రచారం.. మొదలైన తాయిలాల పర్వం - Greater hyderabad municipal elections 2020

సవాళ్లు... విమర్శలు.. ప్రతి విమర్శలతో మారుమోగిన బల్దియా ప్రచారానికి తెరపడింది. హామీలతో హోరెత్తిన మైకులు మూగబోయాయి. ఓటర్లను ఆకట్టుకోవడానికి శాయశక్తుల ప్రయత్నించిన నాయకులు... తుది అంకానికి సిద్ధమయ్యారు.

campaigning-is-over
campaigning-is-over

By

Published : Nov 29, 2020, 8:41 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. బస్తీ ఎన్నికలను పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. బల్దియాపై తమ జెండా ఎగురవేసేందుకు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. సవాళ్లు.. విమర్శలు.. ప్రతి విమర్శలతో మారుమోగిన మైకులు మూగబోయాయి. రాజకీయ పార్టీలు ఎత్తులు పైఎత్తులతో ముందుకు వెళ్లాయి. ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చుకొని ఓటర్లను అభ్యర్థించారు.

డిసెంబర్ 1న పోలింగ్...

15 రోజులపాటు హోరాహోరీగా ప్రధాన పార్టీలు ప్రచారం చేశాయి. డిసెంబర్‌ 1న పోలింగ్ జరగనుండగా... 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. మంగళవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ జరగనుంది. జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. 1,122 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రేటర్​లోని 9,101 పోలింగ్ కేంద్రాల్లో ఓటు ఎలా వేయాలో వివరిస్తూ వీడియో ద్వారా ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు.

74 లక్షల ఓటర్లు...

ఎన్నికల బరిలో తెరాస నుంచి 150 మంది, భాజపా నుంచి 149 మంది, కాంగ్రెస్ నుంచి 146 మంది, తెదేపా నుంచి 106 మంది, ఎంఐఎం నుంచి 51 మంది, సీపీఐ నుంచి 17 మంది అభ్యర్థులు, 12 మంది సీపీఎం, 415 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. జీహెచ్‌ఎంసీలో మొత్తం 74 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు.

అత్యధికంగా జంగమ్మెట్​లో 20 మంది..

కొవిడ్ మార్గదర్శకాలకు లోబడి ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. అత్యధికంగా జంగమ్మెట్ డివిజన్‌లో 20 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా... ఐదు డివిజన్లలో బరిలో ఉన్న కేవలం ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. ఉప్పల్, బార్కస్, నవాబ్‌సాహెబ్‌కుంట, టోలిచౌకి, జీడిమెట్లలో కేవలం ముగ్గురు చొప్పున అభ్యర్థుల పోటీలో ఉన్నారు.

భౌతికదూరం పాటించేలా...

ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ బూత్​ ప్రవేశద్వారంలో శానిటైజర్ ఏర్పాటు చేశారు. ఓటు వేసేవారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. పోలింగ్ సిబ్బందికి సైతం కరోనా కిట్లు అందించారు. కరోనా నేపథ్యంలో ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేశారు.


తాయిలాలతో ఓటర్లకు గాలమేస్తున్న అభ్యర్థులు

ప్రచారం ముగియడం వల్ల అభ్యర్థులు ఓటర్లకు గాలం వేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు యత్నిస్తున్నారు. ఒక పార్టీ అభ్యర్థి బీరు బాటిళ్లు ఇస్తే.. మరొక పార్టీ అభ్యర్థి ఫుల్‌ బాటిళ్లు.. ఇలా అభ్యర్థులు తాయిలాల పంపిణీకి తెరతీశారు. ఖర్చులన్నీమావే.. మీకేం ఫికర్‌ కావద్దు’అంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చూడండి:

ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. మారమ్మకు ఇల్లు కట్టిస్తామని హామీ

ABOUT THE AUTHOR

...view details