TELANGANA MLC ELECTIONS 2021: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో(mlc elections) గెలుపే లక్ష్యంగా తెరాస వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. డిసెంబర్ 10న జరిగే ఎన్నికల్లో ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ముందుకెళ్తోంది. ఇప్పటికే ఆరు స్థానాలను ఏకగ్రీవం చేసుకున్న గులాబీ పార్టీ.. మిగతా ఆరింటిలోనూ పాగా వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని స్థానిక సంస్థల్లో స్పష్టమైన ఆధిక్యం ఉన్నప్పటికీ.. ఏమాత్రం ఏమరపాటుగా ఉండొద్దన్న భావనతో పక్కా కార్యాచరణ రచించింది. ఇందుకోసం ఇప్పటికే నియోజకవర్గాల వారీగా పార్టీ సన్నాహక సమావేశాలను నిర్వహించిన అధికార పార్టీ.. తమ ప్రజాప్రతినిధులను క్యాంపులకు తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఉభయ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల నుంచి.. భారీగా తెరాస ప్రజాప్రతినిధులను శిబిరాలకు తరలించింది. వైరా, పాలేరు, సత్తుపల్లి, ఇల్లెందు, కొత్తగూడెం, భద్రాచలం నుంచి ప్రజాప్రతినిధులను గోవా శిబిరానికి తరలించారు. సత్తుపల్లి నియోజకవర్గంలో అనూహ్యంగా ఇద్దరు ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు.. మరో స్వతంత్ర ప్రజాప్రతినిధి తెరాస శిబిరంలో కలిసి గోవా శిబిరానికి వెళ్లారు. మిగిలిన నియోజకవర్గాలకి చెందిన తెరాస ప్రజాప్రతినిధులు.. మంగళవారం క్యాంపులకు బయలుదేరనున్నారు.
తెరాస బంపర్ ఆఫర్
శిబిరాలకు తరలివెళ్లే పార్టీ ప్రజాప్రతినిధులకు తెరాస(trs) బంపర్ ఆఫర్ ఇచ్చింది. తెరాస తరుఫున భార్యలు ప్రజాప్రతినిధులుగా ఉంటే.. వారితోపాటు భర్తలను క్యాంపులకు తీసుకెళ్లింది. భర్తలు ప్రజాప్రతినిధులుగా ఉంటే.. వారి వెంట సతీమణులను తీసుకెళ్లే అవకాశం కల్పించారు. ఒకటో తేదీ నుంచి 9 వరకు గోవాలోనే మకాం పెట్టనున్నారు. పదోతేదీన నేరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. గోవా క్యాంపు కోసం తెరాస దాదాపు 4 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ కూడా తమ ప్రజాప్రతినిధులను.. తూర్పుగోదావరి జిల్లా మారేడిమిల్లికి తరలించింది.