ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 16, 2022, 9:06 AM IST

ETV Bharat / city

CAG Report on Telangana: నష్టాల్లో 16 ప్రభుత్వ రంగ సంస్థలు: కాగ్

Cag Report on Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పనితీరు విశ్లేషించిన కాగ్‌... 30 ప్రభుత్వ రంగ సంస్థల్లో గడచిన ఆర్థిక సంవత్సరంలో 12 సంస్థలు లాభాలను ఆర్జించాయని పేర్కొంది. 16 నష్టాల బారినపడినట్లు వివరించింది. 2021 మార్చి నాటికి 30 సంస్థల్లో నికర నష్టాలు దాదాపుగా రూ. 60 వేల కోట్లు ఉన్నట్లు కాగ్ తేల్చింది. నష్టాల పాలవుతున్న సంస్థల పనితీరును సమీక్షించి ఆర్థికపరమైన మెరుగుదల కోసం తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

Cag Report on Telangana
నష్టాల్లో 16 ప్రభుత్వ రంగ సంస్థలు: కాగ్

Cag Report on Telangana: vరాష్ట్రంలో 82 ప్రభుత్వ రంగసంస్థలుండగా అందులో 66 మాత్రమే పనిచేస్తున్నాయి. అందులో 8 విద్యుత్ రంగానికి చెందినవి. 2020- 21లో ఆయా సంస్థల ఆర్థిక పనితీరు విశ్లేషణ కోసం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్- కాగ్‌కి 30 సంస్థలు మాత్రమే సమాచారం అందించాయి. ఆ సమాచారం ఆధారంగా ఆ సంస్థల ఆర్థిక పనితీరును విశ్లేషించిన కాగ్... తన పరిశీలనలు, అభ్యంతరాలతో పాటు సిఫారసులతో కూడిన నివేదిక సమర్పించింది. 2020-21లో ఆ 30 సంస్థల టర్నోవర్‌ రూ. 66వేల 316 కోట్లుగా పేర్కొన్న కాగ్‌... అది రాష్ట్ర జీఎస్​డీపీకి 6.76 శాతమని పేర్కొంది. గతేడాదితో ఏడాదితో పోలిస్తే టర్నోవర్ 10.41 శాతం తగ్గిందని వివరించింది. కొవిడ్ మహమ్మారి వల్ల బొగ్గుకు డిమాండ్ తగ్గి ముందు సంవత్సరం కంటే సింగరేణి సంస్థకు 37 శాతం రాబడి అంటే రూ. 5,921 కోట్లు తగ్గింది. కరోనాతో ఆర్టీసి టర్నోవర్ 44 శాతం అంటే రూ. 1,630 కోట్లు తగ్గిందని తెలిపింది.

16 సంస్థల నష్టాలు...

30 సంస్థల్లో 2021 మార్చి నాటికి మొత్తం పెట్టుబడి రూ. 1,20 లక్షల కోట్లలో రాష్ట్ర ప్రభుత్వ మూలధనం వాటా, పెట్టుబడి రూ. 38 వేల కోట్లు. 2020-21లో ఏ ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరించలేదని, పెట్టుబడులు ఉపసంహరించలేదని కాగ్ పేర్కొంది. ఆ 30 సంస్థల్లో 2020-21లో 12 మాత్రమే… రూ. 728 కోట్ల లాభాలను ఆర్జించగా... 16 సంస్థలు ఏకంగా రూ. 10,295 కోట్ల నష్టాలను చవిచూశాయని వివరించింది. 2021 మార్చి 31 వరకు అన్ని సంస్థలకు చెందిన నికర నష్టాలు రూ. 59,856 కోట్లు. 2020-21లో సింగరేణి నికర లాభం రూ. 272 కోట్లు కాగా... జెన్కో, ట్రాన్స్‌కో లాభాలు రూ. 168... 206 కోట్లు. అటవీ అభివృద్ధి సంస్థ రూ. 51 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

ఆ సంస్థల్లో నష్టాలు...

దక్షిణ డిస్కం రూ. 4,622 కోట్లు, ఉత్తర డిస్కం రూ. 2,440 కోట్ల నష్టాలు పొందాయి. ఆర్టీసీకి రూ. 2,329 కోట్ల నష్టం వాటిల్లింది. గృహ నిర్మాణ సంస్థ రూ. 733 కోట్లు, మెట్రో రైల్ లిమిటెడ్ రూ. 96 కోట్లు, రాజీవ్ స్వగృహ సంస్థ రూ. 66 కోట్ల నష్టాలను చవిచూశాయి. నష్టాలు పొందుతున్న సంస్థల పనితీరు సమీక్షించాలని ప్రభుత్వానికి కాగ్ సూచించింది. ఆయా సంస్థల ఆర్థిక పనితీరును మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. 2020-21 లో కేవలం ఒక్క సింగరేణి మాత్రమే పరిశోధనా, అభివృద్ధి కార్యకలాపాలను చేపట్టిందన్న కాగ్... ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం బడ్జెట్ సాయం అందించి ఆ దిశగా సంస్థలను ప్రోత్సహించాలని సూచించింది.


ఇదీచూడండి:

Jangareddygudem Issue: 'మంచి చేస్తారని వెళ్తే.. అబద్ధాలు చెప్పమన్నారు'

ABOUT THE AUTHOR

...view details