ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ లోటు ఎక్కువే ఉంది. గత ఆర్థిక సంవత్సరం మొత్తం రెవెన్యూ లోటు రూ.35,540 కోట్లు ఉండగా ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే రూ.21,242.14 కోట్లుగా తేలింది. నిజానికి రెవెన్యూ లోటును ఎప్పటికప్పుడు తగ్గిస్తుండాలి. ఇంకా చెప్పాలంటే అసలు లేకుండా చూసుకోవాలి. రాబడి కన్నా ఖర్చులు మరీ ఎక్కువ చేస్తుండటంతో లోటు పెరిగిపోతోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెల(ఏప్రిల్)లో రూ.17,680 కోట్ల లోటు ఉండగా మే నెలాఖరుకు రూ.20,113 కోట్లకు చేరింది. ఈమేరకు రాష్ట్ర తొలి మూడు నెలల లెక్కలను కాగ్ పరిశీలించి ఖరారు చేసింది. వివిధ రూపాల్లో రాష్ట్రానికి రెవెన్యూ రాబడి కింద రూ.30,728.81 కోట్లు వచ్చాయి. అదే సమయంలో రెవెన్యూ ఖర్చుల మొత్తం రూ.51,970 కోట్లుగా ఉంది.
* దీనికితోడు ద్రవ్యలోటు కూడా ఎక్కువే ఉంది. తొలి మూడు నెలల ద్రవ్యలోటు మొత్తం రూ.25,874.28 కోట్లుగా తేల్చారు.
సంపద సృష్టిపై దృష్టి అంతంతే...
రాష్ట్రంలో ఏప్రిల్, మే, జూన్‌లలో చేసిన మొత్తం ఖర్చులో 92% వరకు రెవెన్యూ ఖర్చులే ఉన్నాయి. ఇలాంటి వ్యయాలతో ఎలాంటి ఆదాయమూ సృష్టించలేం. తిరిగి ఎలాంటి సంపదనూ పొందలేం. కేవలం ప్రభుత్వ నిర్వహణ, జీతాలు, వేతనాలు, పింఛన్లు, అప్పులు, వడ్డీ చెల్లింపులు, వివిధ సంక్షేమ కార్యక్రమాల వ్యయమంతా కలిసి రెవెన్యూ ఖర్చుగా ఉంటుంది. ఇవికాకుండా ఇతర రెవెన్యూ ఖర్చు అంటూ... ఏకంగా రూ.28,583.79 కోట్లు చూపారు. ఇందులో రవాణా, కార్యాలయాల నిర్వహణ, కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు, కొన్ని సంస్థలకు అందించే గ్రాంట్ ఇన్ ఎయిడ్ తదితర ఖర్చులన్నీ కలిసి ఉంటాయి. కేంద్రం వివిధ పథకాలకు ఇచ్చే నిధులు నేరుగా పీడీ ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ఆ మొత్తం అంతా కూడా రెవెన్యూ ఖర్చులోకి వస్తుంది. అదే సమయంలో మొత్తం ఖర్చులో మూలధన వ్యయం 8% మాత్రమే. అంటే ఈ నిధులను ప్రాజెక్టులు, ఇతర నిర్మాణ కార్యక్రమాలకు ఖర్చు చేసి ఉంటారు. ఈసారి మూలధన వ్యయంలో అంతర్రాష్ట సర్దుబాట్లు కలిసే ఉన్నాయని కాగ్ పేర్కొంది.