రాష్ట్రం చేసే ఖర్చులను ఏ నెలకు ఆ నెల పీఏజీ కార్యాలయానికి పంపుతారు. అక్కడ వాటిని పరిశీలించి ప్రతి నెలా రాష్ట్ర ఆదాయం, అప్పులు, ఖర్చులు, రెవెన్యూ, ద్రవ్యలోటులను తేలుస్తారు. ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత మొత్తం వివరాలను క్రోడీకరించి కాగ్ వెల్లడిస్తుంది. కేంద్రం ఇచ్చే రుణాలకు, బహిరంగ మార్కెట్ రుణ పరిమితికి.. మూలధన వ్యయంతో కూడిన రుణ పరిమితులకు ఈ లెక్కలనే ప్రాతిపదికగా తీసుకుంటామని ఇప్పటికే కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ఇంత కీలకమైన ఈ లెక్కలను తేల్చే క్రమంలో రాష్ట్రంలో అనేక ఆర్థిక మాయలు చోటు చేసుకుంటున్నాయి. వ్యక్తిగత డిపాజిట్ ఖాతాల నిర్వహణ...ఆర్థిక సంవత్సరం చివర్లో ఆ మొత్తాలను సున్నా నిల్వలుగా చూపడం...ప్రజా పద్దు కింద ప్రభుత్వం వాడుకున్న మొత్తాలను, రుణాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆ ఏడాది ఏ మొత్తాలైతే ప్రజాపద్దులో భాగంగా తిరిగి చెల్లించారో ఆ మేరకే పీఏజీకి తెలియజేయడం వంటి అనేక మాయలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు విస్తుగొలిపేవిగా తయారయ్యాయి.
లెక్కల్లో మాయాజాలం
* 2022 ఫిబ్రవరి నెలాఖరునాటికి ఉన్న లెక్కలు, ఆ తర్వాత మార్చి నెల చివర్లో వెలువడిన ప్రాథమిక లెక్కలు విస్తుగొలిపేవిగా ఉన్నాయి. పదకొండు నెలల కాలంలో రూ.1,81,680.30 కోట్లు ఖర్చు చేస్తే మార్చి నెలాఖరుకి ఆ ఖర్చు రూ.1,75,714.63 కోట్లకు తగ్గిపోయింది. మార్చిలో పైసా కూడా ఖర్చు లేకపోవడం.. అంతకుముందు చేసిన ఖర్చును కూడా తగ్గించి చూపడం గమనార్హం.
* రాష్ట్ర రెవెన్యూ, ద్రవ్యలోటులను కూడా ఫిబ్రవరితో పోలిస్తే మార్చి నెలాఖరుకు అనూహ్యంగా తగ్గిపోయింది. 2022 ఫిబ్రవరి నాటికి రెవెన్యూ లోటు రూ.38,169.31 కోట్లు. అదే మార్చి చివరికి రూ.8,370.51 కోట్లుకు తగ్గించి చూపారు. మార్చి నెలలో వచ్చిన ఆదాయం లెక్కల్లో కనిపిస్తుండగా ఆ నెలలో అసలు ఖర్చే చేయనట్లు లెక్కలు రూపొందించారు. దీంతో ఒక్కసారిగా రెవెన్యూ రాబడి పెరిగింది. అంతకుముందు నెల వరకు చేసిన రెవెన్యూ ఖర్చు తగ్గించి చూపించారు. దీంతో రెవెన్యూ లోటు తగ్గించి చూపడం సాధ్యమైంది. ఇలా ఖర్చుల మినహాయింపు ఎలా సాధ్యమన్న ప్రశ్నకు కొన్నింటిని కార్పొరేషన్ వ్యయాలుగా చూపించి ఉంటారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
* అప్పుల లెక్కలూ ఇలాగే మారిపోయాయి. 2022 ఫిబ్రవరి నెలాఖరుకి రిజర్వుబ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలు రూ.52,164.68 కోట్లు. మార్చిచివరికి ఆ రుణం రూ.25,194.62 కోట్లకు తగ్గింది. ఒక ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాల నుంచి ఆ ఏడాది తీర్చేసిన మొత్తాన్ని మినహాయించి ప్రజారుణం తేలుస్తారు. ప్రజారుణం అంటే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వుబ్యాంకు నుంచి తీసుకునే బహిరంగ మార్కెట్ అప్పు. నాబార్డు రుణాలు, కేంద్ర నుంచి వచ్చే రుణాలు అన్నీ కలిసి ఉంటాయి. అదే సమయంలో ప్రజాపద్దు (పబ్లిక్ అకౌంట్) నుంచి నిధులను ప్రభుత్వం అప్పుగా తీసుకుంటుంది. వివిధ కార్పొరేషన్లు, యూనివర్సిటీలు, స్థానిక సంస్థలు, ఉద్యోగుల భవిష్యనిధికి వసూలయ్యే మొత్తాలు.. ఇలాంటివి కూడా వినియోగించుకుంటుంది. ఇక్కడ పూర్తి లెక్కలు చూపకపోవడం వల్లే రుణ మొత్తాల్లో తేడాలు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు.
* ప్రజాఖాతా నుంచి తీసుకున్న రుణం తిరిగి ఎంత చెల్లించారో ఆ మొత్తం పరిగణనలోకి తీసుకొని లెక్కలు వెల్లడించిన ఆర్థికశాఖ అధికారులు 2021-22లో ప్రజాఖాతా ద్వారా ఎంత రుణం వినియోగించుకున్నారన్న లెక్కలు వెల్లడించలేదు. అందువల్లే రుణం మొత్తం మినహాయించి చూపించారని పేర్కొంటున్నారు.