CAG on AP Budget: రాష్ట్ర బడ్జెట్ నిర్వహణ తీరు బాగోలేదని కాగ్ ఆక్షేపించింది. 2020 మార్చి నెలాఖరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆడిట్ పూర్తయిన పద్దులను కాగ్ విశ్లేషించింది. ఒకవైపు రాష్ట్రస్థూల ఉత్పత్తిలో రుణాల శాతం పెరిగిపోతోందని.. ఏటా ప్రభుత్వానికి వస్తున్న రెవెన్యూ ఆదాయంలో వడ్డీకి చెల్లించాల్సిన వాటాయే అధికమని తెలిపింది. గడిచిన అయిదేళ్లలో కొత్తగా ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులో 65 నుంచి 81% పాత అప్పు తీర్చేందుకే వినియోగించాల్సి వస్తోందని స్పష్టం చేసింది. రోజువారీ అవసరాలు తీర్చుకునేందుకు, రుణాలపై వడ్డీలు చెల్లించేందుకే మళ్లీ అప్పు తీసుకోవడం ఆర్థిక అస్థిరతకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ రుణాలు చెల్లించేందుకు సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే అభివృద్ధి పనులకు నిధులు ఉండవని, ప్రభుత్వానికి కాగ్ తేల్చిచెప్పింది. ఒకవైపు సగటున... 6.31% వడ్డీతో అప్పులు తెచ్చుకుంటున్న రాష్ట్రప్రభుత్వం వివిధ కంపెనీలు కార్పొరేషన్ల ద్వారా కనీసం 0.04% ప్రతిఫలం కూడా పొందడంలేదని ప్రస్తావించింది. 2020 మార్చి నెలాఖరు వరకు ఉన్న లెక్కల ప్రకారం.. రాబోయే ఏడేళ్లలోనే లక్షా 10 వేల 10 కోట్ల ర రూపాయల అప్పులను... ప్రభుత్వం తీర్చాల్సి ఉంటుందని కాగ్ పేర్కొంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం 32 వేల 373 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని క్రితం ఏడాదితో పోలిస్తే ఇవి 17.20 శాతం ఎక్కువని... కాగ్ తెలిపింది. బడ్జెట్ పద్దుకు సంబంధం లేకుండా 26 వేల 968 కోట్ల అప్పులున్నాయని, వీటిని బడ్జెట్‌లో చూపకపోవడం శాసనసభ పర్యవేక్షణను నీరుగార్చడమేని కాగ్ దుయ్యబట్టింది.
2019-20 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడుల్లో వడ్డీ చెల్లింపుల వాటా 15.90 శాతమని ఇది 11.30 శాతం దాటరాదని 14వ ఆర్థిక సంఘం నిర్దేశించినట్లు కాగ్ గుర్తుచేసింది. ఇతర రాష్ట్రాల సగటుతో పోలిస్తే వడ్డీ చెల్లింపులు, పరిపాలనా ఖర్చులు, పింఛన్లు ఎక్కువగా ఉన్నాయని కాగ్ విశ్లేషించింది. వ్యక్తిగత డిపాజిట్ ఖాతాలకు 2019-20 సంవత్సరంలో పెద్ద ఎత్తున నిధులు బదిలీచేసినట్లు చూపారని, వాస్తవంలో సంబంధిత ప్రభుత్వ శాఖల సిబ్బంది ఆ నిధులు ఖర్చు చేసుకునేలా అవి అందుబాటులో ఉండటం లేదని పేర్కొంది. పీడీ ఖాతాలకు నిధులు బదిలీ చేసినా, వాటిని ఖర్చు చేయడంలేదని స్పష్టంచేసింది.