తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం రేపు అత్యవసరంగా సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్రంలో లాక్డౌన్ విషయమై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అమలు చేస్తున్న లాక్డౌన్ రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
పలు అంశాలపై చర్చ
దీంతో పాటు వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయం సంబంధిత సీజనల్ అంశాలపై చర్చ జరగనుంది. ప్రాణహిత నుంచి వరద ప్రారంభమైన నేపథ్యంలో గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసి జలాశయాలు, చెరువులు నింపడంపై సమావేశంలో చర్చిస్తారు. రాష్ట్రంలో జలవిద్యుత్ ఉత్పత్తి, తదితర అంశాలపై కూడా మంత్రివర్గంలో చర్చ జరగనుంది.
లాక్డౌన్ ఎత్తివేసే దిశగా..
వైరస్ ఉద్ధృతి తగ్గిన నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తివేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కేసులు తగ్గుముఖం పట్టిన పరిస్థితుల్లో లాక్డౌన్ ఎత్తివేసి వివిధ రంగాల కార్యకలాపాలకు మార్గం సుగమం చేసే భావనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా ఆయా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొంటాయని, వివిధ వర్గాల వారికి తగిన ఉపాధి లభిస్తుందని అంటున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను కూడా కాస్త సడలించే అవకాశం కనిపిస్తోంది.
రాత్రి కర్ఫ్యూ..
రాత్రి పూట కర్ఫ్యూను మాత్రం కొనసాగించే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాత్రి 8 గంటలు లేదా 9 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లో ఉండే అవకాశం ఉంది. జనం గుమిగూడడం, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఉత్సవాలపై మాత్రం ఆంక్షలు కొనసాగించే పరిస్థితి కనిపిస్తోంది. లాక్డౌన్ ఎత్తివేసే పరిస్థితులు వస్తే మాత్రం కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:
ప్రత్యేక హోదా: 'పదేపదే అడగడం తప్ప చేసేదేమీ లేదు'