పీఆర్సీ జీవోలపై మంత్రిమండలి సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. రాష్ట్ర ఆదాయం పడిపోవడంతోపాటు కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా తగ్గిందని....రుణ పరిమితి దాటిపోయామని సీఎం అన్నారు. ఆదాయం పెరిగితే ఎంతో కొంత అప్పు తీసుకునే పరిమితి పెరిగేదన్నారు. ఈ ఇబ్బందులన్నీ లేకపోయి ఉంటే ఉద్యోగులకు చేయగలిగినంతా చేసేవాళ్లమని జగన్ అన్నట్లు సమాచారం. వాళ్ల డిమాండ్లు పరిష్కరించాలంటే ఏదో ఒక పెద్ద పథకం ఆపాల్సి వస్తుందని.. కావున ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టలేమని స్పష్టం చేసినట్టు సమాచారం. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఏం చేశామన్న దానిపై 15, 16 పాయింట్లతో కూడిన సమాచారం మంత్రులందరికీ సీఎం అందజేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 27శాతం ఐ.ఆర్ ఇచ్చామని... దీనివల్ల ప్రభుత్వంపై 17వేల 900 కోట్ల భారం పడిందన్నారు. ఉద్యోగులకు అప్పుడు ఐఆర్ ఇవ్వకపోతే సుమారు 18వేల కోట్లు వేరే పథకాలకు వాడుకుని ఇండేవాళ్లం కదా అని మంత్రులతో సీఎం జగన్ అన్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు ఇంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ఖజానాపై 10 వేల240 కోట్ల భారం పడుతున్నా పీఆర్‌సీ ఇచ్చామని అయినా జీతాలు తగ్గుతున్నాయంటూ ఉద్యోగులను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారని సీఎం అన్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న హెచ్ఆర్ఏ ఐదు, ఆరు రాష్ట్రాల్లో ఇస్తున్నారని అదే ఇక్కడా ప్రతిపాదించామని సీఎం అన్నారు. ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు రెండేళ్లకు పెంచడం వల్ల....లక్ష రూపాయల జీతం ఉన్న ఉద్యోగికి దాదాపు 24 లక్షలు కలిసివచ్చినట్లేగా అని జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఉద్యోగ విరమణ తర్వాత పింఛన్ కూడా పెరుగుతుందన్నారు. ఉద్యోగులు అడగకపోయినా జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లలో 10శాతం ప్లాట్లు ఉద్యోగులకు కేటాయించామన్నారు. దీనిలో 20శాతం రాయితీ కూడా ఇస్తున్నామని తెలిపారు. ఇవన్నీ ఉద్యోగుల మంచి కోసం చేసినవే కదా?’అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు తెలిసింది.