ముగిసిన కేబినెట్ సమావేశం.. శాసన మండలి రద్దుకు ఆమోదం - మంత్రివర్గ సమావేశం ప్రారంభం
09:40 January 27
రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ముగిసింది. కేబినెట్... కీలక నిర్ణయం తీసుకుంది. శాసనమండలి రద్దు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. కాసేపట్లో శాసనసభలో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనుంది.
పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ఆమోదించకుండా సెలక్ట్ కమిటీకి పంపటంతో ఆగ్రహం చెందిన వైకాపా సర్కారు... శాసనమండలిని రద్దు చేసేందుకే మొగ్గుచూపింది. మండలిలో మెజారిటీ లేకపోవటంతో శాసనసభలో ఆమోదించిన బిల్లులు మండలిలో ఆమోదం పొందలేకపోతున్నాయి. బిల్లులు తిప్పి పంపడం, జాప్యం చేయడం ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. ఆగ్రహం చెందిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్... శాసనమండలి రద్దు దిశగా అడుగులు వేశారు. పార్టీలో ముఖ్యనేతలు, న్యాయ నిపుణులతోనూ చర్చించిన జగన్.. మండలిపై వేటు వేయాలని నిర్ణయించుకున్నట్లు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటివరకు మండలి రద్దు చేస్తామని అధికారికంగా చెప్పకపోయినా... రద్దుకే సీఎం మొగ్గు చూపుతున్నట్లు వైకాపా నేతలు స్పష్టం చేశారు. పార్టీకి నష్టం జరుగుతుందని పలువురు స్పష్టం చేసినా సీఎం రద్దుకే నిశ్చయించినట్లు చెబుతున్నారు. తాజాగా.. మంత్రి మండలి సమావేశంలో.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మండలి రద్దుకు కేబినెట్ లో ఆమోదం తెలిపారు.