ఇప్పటికే 2సార్లు వాయిదా పడిన కేబినెట్ సమావేశంలో కీలకమైన అంశాల చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా రెండో వేవ్ కార్చిచ్చులా వ్యాపిస్తున్న సమయంలో.. కట్టడికి పాక్షికంగా కరోనా కర్ఫ్యూ ఏర్పాటుపై కేబినెట్ చర్చించనుంది. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఆంక్షలు సడలిస్తూ.. మిగతా సమయం అంతా 144 సెక్షన్ విధించేందుకు కేబినెట్ సమ్మతించనుంది. ఆస్పత్రుల్లో పడకల పెంపు, ఆక్సిజన్ సరఫరా, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు, వ్యాక్సినేషన్ ప్రక్రియపైనా నిర్ణయాలు తీసుకోనుంది. 18-45 ఏళ్ల మధ్య వారికి వ్యాక్సినేషన్ కోసం నిధుల కేటాయింపుపైనా కేబినెట్ ఆమోదం తెలపనుంది.
విశాఖలోని కైలాసగిరి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకూ పర్యాటక ప్రాజెక్టుల పేరిట రాష్ట్ర అతిథిగృహాల నిర్మాణం చేపట్టే కీలకమైన అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. మొత్తం 8 ప్రాజెక్టుల నిర్మాణం కోసం పర్యాటకశాఖ కేబినెట్‌కు ప్రతిపాదించింది. బీచ్ రోడ్ అభివృద్ధి, రిషికొండ, గ్రేహౌండ్స్ కొండ, తొట్లకొండ, బే పార్క్ ప్రాజెక్టుల ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదాన్ని తెలియచేసే అవకాశాలున్నాయి. రాష్ట్ర అతిథిగృహం నిర్మాణాన్ని పర్యాటక ప్రాజెక్టు కిందే చేపట్టాలని పర్యాటకశాఖ ప్రతిపాదించింది.