ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో లాక్‌డౌన్‌పై ఇవాళ కీలక నిర్ణయం! - telangana varthalu

తెలంగాణలో కొవిడ్ విజృంభణ నేపథ్యంలో లాక్​డౌన్​పై రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనుంది. మధ్యాహ్నం భేటీ కానున్న కేబినెట్... లాక్​డౌన్ విధించే అంశంపై పూర్తిస్థాయిలో చర్చించి ఓ నిర్ణయానికి రానుంది. ఒకవేళ లాక్​డౌన్​పై నిర్ణయం తీసుకుంటే శనివారం నుంచి విధించే అవకాశం కనిపిస్తోంది.

telangana lock down decision
telangana lock down decision

By

Published : May 11, 2021, 11:16 AM IST

తెలంగాణలో లాక్‌డౌన్‌పై ఇవాళ కీలక నిర్ణయం!

తెలంగాణలో కరోనా కలవరం కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలన్న తేడా లేకుండా కొవిడ్ కేసులు భారీగా బయటపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్​డౌన్ విధించడం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సందర్భంలో ఇతర రాష్ట్రాల్లో లాక్​డౌన్ విధించినా ఫలితం లేదని, కేసుల తీవ్రత తగ్గలేదన్న మరో అభిప్రాయం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వాస్తవానికి లాక్​డౌన్ విధింపుపై అంత సుముఖంగా లేదు. లాక్​డౌన్ ద్వారా ఫలితం ఉండబోదని, మరిన్ని సమస్యలు వస్తాయని నాలుగు రోజుల క్రితం సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అయితే రోజురోజుకూ కేసులు పెరుగుతుండడం, పొరుగు రాష్ట్రాల్లో లాక్​డౌన్, ఆంక్షల అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పైనా ఒత్తిడి ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్​లో కేబినెట్ భేటీ కానుంది. వైరస్ ఉదృతి నేపథ్యంలో రాష్ట్రంలో లాక్​డౌన్ విధించే అంశంపై సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు.

లాక్​డౌన్​కు సంబంధించి ఉన్న వివిధ వాదనలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తారు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు, ఫలితాలపై కూడా చర్చిస్తారు. ఒకవేళ రాష్ట్రంలోనూ విధిస్తే ఉత్పన్నమయ్యే ఇక్కట్లు, సాదకబాదకాలతో పాటు సంబంధిత అంశాలపైనా దృష్టి సారిస్తారు. అటు రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. కొనుగోళ్ల ప్రక్రియపై లాక్​డౌన్ ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న అంశంపై కూడా కేబినెట్ చర్చించనుంది. పేదలు, కార్మికులు, వలస కార్మికులు, వివిధ వర్గాల వారి పరిస్థితులు, వారిపై పడే ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోనున్నారు. ఆయా వర్గాలకు ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన తోడ్పాటు, సంబంధిత అంశాలపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించి రాష్ట్రంలో లాక్​డౌన్ విధింపుపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. దీంతో పాటు రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలు, రోగులకు చికిత్స, సదుపాయాలు సహా టీకాల అంశంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఒకవేళ లాక్​డౌన్ విధింపుపై కేబినెట్ నిర్ణయం తీసుకుంటే శనివారం నుంచి రెండు వారాల పాటు అమలు చేసే అవకాశం కనిపిస్తోంది.

ఇదీ చదవండి: తిరుపతి రుయా ఆస్పత్రిలో ఘటనపై గవర్నర్‌ దిగ్భ్రాంతి

ABOUT THE AUTHOR

...view details