రాష్ట్ర పర్యాటక రంగానికి చెందిన వివిధ ప్రాజెక్టుల ప్రతిపాదనలను మంత్రిమండలి ఆమోదించింది. ఒబెరాయ్, హయత్, ఇస్కాన్ ఛారిటీస్ సంస్థలు రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో రూ.2,800 కోట్ల వ్యయంతో 10 ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నాయి. లగ్జరీ హోటళ్లు, రిసార్ట్‌లు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఇందులో ఉన్నాయి. ఈ మేరకు గురువారం జరిగిన సమావేశంలో మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సాధారణంగా మంత్రివర్గ సమావేశం మధ్యాహ్నం 2, 2.30 గంటల వరకు నిర్వహిస్తారు. గురువారం మాత్రం గంట ముందుగానే భేటీ ముగిసింది.
ఒబెరాయ్ సంస్థ ఏర్పాటు చేయనున్న రిసార్టులు
- విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరంలో రూ.350 కోట్లతో 40 ఎకరాల్లో 300 విల్లాలతో
- తిరుపతిలోని పేరూరులో రూ.250 కోట్లతో 20 ఎకరాల్లో 100 విల్లాలతో
- కడప జిల్లా గండికోటలో రూ.250 కోట్లతో 50 ఎకరాల్లో 120 విల్లాలతో
- చిత్తూరు జిల్లా హార్స్‌లీహిల్స్‌లో రూ.250 కోట్లతో 21 ఎకరాల్లో 120 విల్లాలతో
- తూర్పుగోదావరి జిల్లా పిచ్చుకల్లంకలో రూ.250 కోట్లతో 30 ఎకరాల్లో 150 విల్లాలతో
హయత్ సంస్థ ఆధ్వర్యంలో
- విశాఖలోని శిల్పారామంలో 200 గదులు, 1500 సీట్ల సామర్థ్యంతో 3 ఎకరాల్లో రూ.200 కోట్లతో 5 స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్
- తిరుపతి శిల్పారామంలో 225 గదులు, 1500 సీట్ల సామర్థ్యంతో 2.66 ఎకరాల్లో రూ.204 కోట్లతో 5 స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్
- విజయవాడలో రూ.92 కోట్ల వ్యయంతో 81 గదులతో 4 స్టార్ హయత్ ప్యాలెస్ హోటల్