cab driver success story: రంగారెడ్డి జిల్లా గుడితండా అప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన లక్కునాయక్, లక్ష్మీబాయిలు దంపతులు. 30 ఏళ్ల క్రితం బతుకు దెరువు కోసం.. నగర శివారు ప్రాంతమైన హయత్‌నగర్‌లోని బంజారాకాలనీకి వచ్చారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. లక్కునాయక్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ... తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చదివిస్తూ వచ్చారు. లక్ష్మీబాయి కుట్టు మిషన్ పనిచేస్తూ.. ఇంట్లో ఖర్చులను వెళ్లదీస్తూ చేదోడువాదోడుగా నిలిచేది.
లక్కునాయక్, లక్ష్మీబాయి ఒక పూట పస్తులు ఉండైనా.. పిల్లలకు మాత్రం పెట్టేవారు. తమ పిల్లలను ఎలాగైనా పెద్ద పెద్ద చదువులు చదివించి.. ప్రయోజకులను చేయాలని తపనతో.. ఎంతో కష్టపడుతూ.. పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా చదివించారు. తర్వాత లక్కు నాయక్ రామోజీ ఫిలిం సిటీలో డ్రైవర్‌గా చేరి ఏడు సంవత్సరాలు పనిచేశారు. ప్రస్తుతం క్యాబ్‌డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
మేం పల్లెటూరి నుంచి వచ్చాం.. నాకు చదవాలనే కోరిక ఉండేది. కాకపోతే.. ఆర్థిక స్తోమత లేకుండే. అందుకే మా పిల్లలను చదివించాలనుకున్నాం.. రాత్రింబవళ్లు ఆటో, క్యాబ్ నడుపుతూ... వాళ్లను చదివించాం. వారానికి ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా పనిచేశాం. మా భార్య కూడా కుట్టుమిషన్ నేర్చుకుని పనిచేస్తోంది. ఎస్‌ఎస్‌సీలో మంచి మార్కులు సంపాదిస్తే కంప్యూటర్ ఇప్పిస్తా... నీట్‌లో ఎంబీబీఎస్ సీట్ కొడితే ఫొన్ ఇప్పిస్తా.. అంటూ తనని ప్రోత్సహించాను. అప్పటి వరకు మా పిల్లలకు ఫోన్ కూడా లేదు. ఇంటర్ తర్వాతే వాళ్లకు మొబైల్ ఇప్పించాను. నాకు చదువు విలువ తెలుసు.. అందుకే వారికి ఆ చదువును అందించాం. - లక్కు నాయక్, క్యాబ్ డ్రైవర్
పిల్లల గురించి.. చాలా కష్టపడ్డాం. కూలీ పనులు చేసి మరి.. నలుగురి పిల్లలను బాగా చదివించాను. మూడు రోజులు ఉపాసం ఉండి.. కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నాం. వాళ్లు కూడా మంచిగా సెటిల్ అయ్యారు. అదే సంతోషం.- లక్ష్మీబాయి, లక్కునాయక్ భార్య