Primary education: ‘ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో ప్రాథమిక విద్య ఛిన్నాభిన్నమైంది. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎలాంటి అవగాహన కల్పించకుండా బలవంతంగా 2.5 లక్షల మంది పిల్లల్ని తరలించడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. బడి ఉంటుందో లేదో అనే కారణంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది చేరలేదు. బాలికల పాఠశాలల్లోనూ బాలురను కలిపేశారు’ అని ‘బడి కోసం బస్సు యాత్ర’ నివేదిక పేర్కొంది. పాఠశాలల విలీనంపై ప్రజాభిప్రాయం తెలుసుకొనేందుకు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు పాఠశాల విద్యా పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు, యూటీఎఫ్, విద్యార్థి, ప్రజాసంఘాల ప్రతినిధులు జులై 25 నుంచి 31 వరకు వారం రోజులపాటు 24 జిల్లాల్లోని 72 పాఠశాలల్ని సందర్శించారు. దీనిపై ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం నివేదిక విడుదల చేశారు. గతేడాది 250 మీటర్లలోపు బడుల్లో తరగతులను విలీనం చేశారు. వీటి ఫలితాలేమిటో ఇప్పటి వరకు వివరించలేదు. ఆంగ్ల మాధ్యమం అమలుకు ఇంటింటికీ తిరిగి సంతకాలు సేకరించిన విద్యాశాఖ.. బడుల విలీనంపై మాత్రం తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకోలేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 5,480 ప్రాథమిక పాఠశాలలు కాగితాల్లో విలీనమయ్యాయి. నివేదికలో కీలకాంశాలివీ..
తగ్గిన ప్రవేశాలు
* బడి ఉంటుందో లేదో తెలియని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు వేసవి సెలవుల్లో ప్రవేశాలు నిర్వహించలేదు. దీంతో పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రైవేటు బాట పట్టారు. ఈ ఏడాది ఒకటో తరగతిలో ప్రవేశాలు భారీగా తగ్గాయి. గతంలో కంటే విద్యార్థులు పెరిగారని చెప్పే బడులే లేవు. కర్నూలు జిల్లాలో ఒక ప్రాథమిక పాఠశాల నుంచి 37 మందిని హైస్కూల్‌కు పంపితే అందరూ ప్రైవేటు బడికే వెళ్లిపోయారు.
* 3, 4, 5 తరగతులు తరలిపోతే 1,2 తరగతుల్లో ఎక్కువ చోట్ల 10 మందిలోపే విద్యార్థులు మిగులుతున్నారు. కొన్నిచోట్ల ఇద్దరు, ముగ్గురే ఉన్నారు. చిన్న బడుల్లో చదువురాదంటున్న విద్యాశాఖ వీటిని కొనసాగిస్తుందా? వీటిలో ఉపాధ్యాయులను ఉంచుతుందా? 1,2 తరగతుల్లో విద్యార్థులు లేకపోతే వచ్చే ఏడాది మూడో తరగతికి పిల్లలు ఎక్కణ్నుంచి వస్తారు?
* పాఠశాలల విలీనంలో దూరాన్ని ప్రాథమిక పాఠశాల నుంచే లెక్కించారు. విద్యార్థి ఇంటి నుంచి దూరాన్ని పట్టించుకోలేదు. దీంతో కొన్నిచోట్ల దూరం కిలోమీటరు కంటే ఎక్కువగా ఉంది. పేద తల్లిదండ్రులిద్దరూ ఉదయాన్నే పనికి వెళ్లాల్సి రావడంతో పిల్లల్ని బడికి తీసుకెళ్లి, సాయంత్రం తీసుకురావడం వారికి సాధ్యమవడం లేదు. గోదావరి జిల్లాల్లో పంట కాల్వలు దాటి వెళ్లాల్సి వస్తోంది. పట్టణాల్లో రహదారులపై చిన్నారులు నడిచివెళ్లడం మరింత ప్రమాదకరంగా మారుతోంది.
* ప్రాథమిక పాఠశాల నుంచి హైస్కూళ్లలో తరగతులు విలీనం చేసినచోట పిల్లలు బడికి వెళ్లేందుకు మొరాయిస్తున్నారు. బడి కొత్తగా ఉండటం, దూరం కావడంతో ఇబ్బంది పడుతున్నారు. దీనిపై బాలల హక్కుల వేదికతో స్వతంత్రంగా అధ్యయనం చేయించాలి.
* ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే కలిసి బడికెళ్లేవారు. ఇప్పుడు చెరో పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. కిలోమీటరు దూరం పుస్తకాల సంచితో నడిచి వెళ్లిరావడం పిల్లలకు కష్టమవుతోందని తల్లిదండ్రులు చెబుతున్నారు.
* శ్రీకాకుళం జిల్లా పలాస, ఎన్టీఆర్ జిల్లా మైలవరం, రామవరప్పాడు ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5.. 1,2 తరగతులను వేర్వేరుగా నిర్వహించడంతో పాఠశాలలు ఛిన్నాభిన్నమయ్యాయి.