RTC Bus Tracking System: ఆర్టీసీ బస్సు ఎక్కడుంది? ఎప్పుడు వస్తుంది? ఇది తెలియక బస్సు కోసం వేచిచూస్తూ చాలా సమయం వృథా అవుతోంది. ఇందుకు పరిష్కార మార్గాన్ని చూపింది టీఎస్‌ఆర్టీసీ. బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునేలా ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఆర్టీసీకి తెలంగాణ వ్యాప్తంగా 96 డిపోలు ఉన్నాయి. ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రయోగాత్మకంగా 140 బస్సులను గుర్తించారు. వీటిలో కంటోన్మెంట్, మియాపూర్-2 డిపోలకు చెందిన 40 ఏసీ పుష్పక్ బస్సులు ఉన్నాయి. వీటిని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తిప్పనున్నట్లు యాజమాన్యం తెలిపింది. మియాపూర్-1 డిపోకు చెందిన మిగితా 100 బస్సులను సుదూర ప్రాంతాలకు తిప్పుతారు. క్రమక్రమంగా రాష్ట్రంలోని అన్ని బస్సుల్లో ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తేనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.
బస్ ట్రాకింగ్ యాప్‌ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బస్‌భవన్‌లో ప్రారంభించారు. 'టీఎస్‌ఆర్టీసీ బస్సు ట్రాకింగ్ పేరు'తో గూగుల్ ప్లే స్టోర్‌లో మొబైల్ యాప్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విధానం ద్వారా ప్రయాణికులు బస్టాప్‌లు, బస్‌స్టేషన్‌లలో నిరీక్షించడాన్ని నివారించవచ్చని సజ్జనార్ తెలిపారు. శ్రీశైలం, విజయవాడ, ఏలూరు, భద్రాచలం, విశాఖపట్నం వంటి మార్గాల్లో నిర్వహిస్తున్న పికెట్ డిపోలో ప్రస్తుతం ట్రాకింగ్ నడుస్తుందని తెలిపారు. మరో రెండు నెలల్లో జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో అన్ని రిజర్వేషన్లు, ప్రత్యేక తరహా సేవలను కూడా ట్రాకింగ్ యాప్‌లో చేర్చనున్నట్లు వెల్లడించారు.