ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Bus Ticket Rate: పండగ ప్రయాణానికి ఛార్జీల మోత - ఛార్జీల ధరలు పెంచేసిన ప్రయాణ సంస్థలు

Bus Ticket Rate: సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకునేందుకు ప్రైవేటు ట్రావెల్స్ సిద్ధమయ్యాయి. పండుగను అదనుగా తీసుకుని టిక్కెట్టుకు రూ. 300 నుంచి రూ. 500 వరకు ధరలను ఒక్కసారిగా పెంచేశాయి. దీనికి తోడు ఆర్టీసీ సైతం 50 శాతం అధనంగా వడ్డనకు దిగింది.

Bus Ticket Rate
Bus Ticket Rate

By

Published : Jan 2, 2022, 8:23 AM IST

Bus Ticket Rate: సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లేవారి రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రైవేటు బస్‌ ట్రావెల్స్‌ ఛార్జీల మోత మోగిస్తున్నాయి. ఆర్టీసీ ఛార్జీలతో పోలిస్తే రెట్టింపు ధరలు పెట్టేశాయి. దీంతో నలుగురైదుగురు సభ్యులున్న కుటుంబం సొంతూరికి ప్రైవేటు బస్సులో వెళ్లాలంటే ఛార్జీలకే జేబులు ఖాళీ కానున్నాయి. ఈ నెల 8 నుంచి పాఠశాలలకు సెలవులు కావడంతో బస్సుల్లో రద్దీ మొదలుకానుంది. 14, 15, 16 తేదీల్లో పండగ ఉండటంతో.. 12, 13 తేదీల్లో బస్సుల్లో అత్యధిక రద్దీ ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులంతా ఈ తేదీల్లోనే సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతుండటంతో బస్సులు, రైళ్లకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. ఇదే అదునుగా ప్రైవేటు బస్సుల్లో ఛార్జీలను ఇష్టారాజ్యంగా పెంచేశారు.

ఏసీ, నాన్‌ ఏసీ.. ఏదైనా బాదుడే

ఈ నెల 12, 13 తేదీల్లో విజయవాడ నుంచి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం వెళ్లే బస్సుల్లో ఛార్జీల మోత ఎక్కువగా ఉంది. ట్రావెల్స్​ను బట్టి నాన్‌ ఏసీ బస్సుల్లో ఒక్కో బెర్త్‌ రూ.900-1,200 వరకు, ఏసీ స్లీపర్‌ బస్సుల్లో రూ.1,300-1,600 వరకు ఉన్నాయి. కొన్ని ఏసీ బస్సుల్లో రూ.2 వేలు కూడా ఉంది. ఆర్టీసీ బస్సులో విజయవాడ నుంచి విశాఖకు సూపర్‌ లగ్జరీ (నాన్‌ఏసీ) రూ.504, వెన్నెల ఏసీ సీటర్‌ రూ.578, స్లీపర్‌ రూ.888గా ఉంది.

  • విజయవాడ నుంచి శ్రీకాకుళానికి వెళ్లే ప్రైవేటు ట్రావెల్స్‌లో కూడా దాదాపు విశాఖ మాదిరి ఛార్జీలే ఉన్నాయి. కొన్నింటిలో రూ.100-200 ఎక్కువగా ఉన్నాయి. నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులు అధికంగా శ్రీకాకుళానికి నడుపుతున్నారు.
  • కడప, తిరుపతి మార్గంలో వెళ్లే బస్సుల్లో సైతం ఆర్టీసీ కంటే రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
  • ఏపీఎస్‌ ఆర్టీసీ రెగ్యులర్‌ బస్సులు కాకుండా, అదనంగా నడిపే సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో 50 శాతం ఛార్జీ ఎక్కువగా తీసుకోనుంది. ప్రైవేటు ట్రావెల్స్‌లో రెగ్యులర్‌, స్పెషల్‌ బస్సులు అనే తేడా లేకుండా అన్నింటిలోనూ ఛార్జీలు పెంచేశారు.

రైళ్లన్నీ ఫుల్‌

సంక్రాంతికి వెళ్లే ప్రయాణికులతో అన్ని రైళ్లలో బెర్తులు, సీట్లు నిండిపోయాయి. పలు రైళ్లలో వెయిటింగ్‌ లిస్ట్‌ పరిధిని దాటేయడంతో రిగ్రెట్‌ చూపిస్తున్నాయి. విజయవాడ నుంచి విశాఖ, శ్రీకాకుళం రోడ్‌ వెళ్లే రైళ్లలో రద్దీ అధికంగా ఉంది. 12, 13 తేదీల్లో ఫలక్‌నుమా, ఈస్ట్‌కోస్ట్‌, ఏపీ ఎక్స్‌ప్రెస్‌, గోదావరి, విశాఖ, ప్రశాంతి తదితర ఎక్స్‌ప్రెస్‌ల్లోని స్లీపర్‌ క్లాస్‌ రిగ్రెట్‌ చూపుతోంది. విశాఖ- విజయవాడ మధ్య ఇంటర్‌సిటీగా నడిచే రత్నాచల్‌, గుంటూరు- విశాఖ మధ్య నడిచే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో కూడా సెకండ్‌ సీటింగ్‌లో వెయిటింగ్‌ లిస్ట్‌ 150-180 మధ్య ఉంది. గుంటూరు-రాయగఢ ఎక్స్‌ప్రెస్‌లో సైతం వెయిటింగ్‌ లిస్ట్‌ 145 వరకు ఉంది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్లే పద్మావతి, తిరుమల, శేషాద్రి, హిమసాగర్‌, కేరళ ఎక్స్‌ప్రెస్‌ల్లో వెయిటింగ్‌ లిస్ట్‌ చాంతాండంత ఉంది.

తిరుగు ప్రయాణానికీ అవస్థలే.

సంక్రాంతికి వెళ్లేటప్పుడే కాదు.. తిరిగొచ్చేటప్పుడు కూడా ప్రయాణానికి కష్టం కాబోతోంది. పండగకు వెళ్లినవారు ఎక్కువగా 16, 17 తేదీల్లో తిరుగు ప్రయాణమవుతున్నారు. దీంతో ఈ రెండు రోజులు శ్రీకాకుళం రోడ్‌, విజయనగరం, విశాఖ నుంచి విజయవాడకు వచ్చే రైళ్లలో వెయిటింగ్‌ లిస్ట్‌ 100కు పైనే ఉంది. గోదావరి, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ల్లో వెయిటింగ్‌ లిస్ట్‌ 200 దాటింది.

ఇదీ చదవండి:Polavaram Project News: పోలవరం సవరణ అంచనాల ఆమోదంలో జాప్యం

ABOUT THE AUTHOR

...view details