పట్టణాల్లో జీవన ప్రమాణాలు పెరగాలి..! మొదటి నుంచి మోదీ సర్కార్ ఇదే లక్ష్యంతో పని చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు పట్టణాల్లోనూ ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించాలని కృషి చేస్తోంది. ఈ అంశానికి కట్టుబడి ఉన్నామని ప్రస్తుత పద్దుతో మరోసారి తేల్చి చెప్పింది కేంద్రం. బడ్జెట్‌లో పట్టణ జీవన ప్రమాణాలు పెంచే దిశగా ప్రత్యేక కేటాయింపులు చేసింది. అత్యవసరమైన తాగునీరు నుంచి పారిశుద్ధ్య నిర్వహణ, నిర్మాణాలు లాంటి అంశాలకు ప్రాధాన్యత నిచ్చింది. ముఖ్యంగా...స్వచ్ఛ భారత్ 2.0 పేరిట పట్టణాలను పరిశుభ్రతకు చిరునామాలుగా మార్చాలని సంకల్పించింది. ఐదేళ్లలో పట్టణాల రూపు రేఖలు మారేలా చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది.
జల్ జీవన్ మిషన్
పట్టణాల్లో నీరు దొరకటమే కష్టం. ఇక మంచినీరు లభ్యమవటం గగనమైపోయింది. వందలకు వందలు ఖర్చు చేస్తే కానీ...స్వచ్ఛమైన నీరు తాగలేరు. ఈ దుస్థితి మారాలన్నది కేంద్రం ప్రధాన లక్ష్యం. అందుకే...పట్టణాల్లో మంచి నీరందించే పథకానికి శ్రీకారం చుట్టనుంది. మొత్తం 4 వేల 378 పట్టణాల్లో ఈ పథకం అమలు కానుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ...మంచి నీటి ప్రాధాన్యాన్ని ఎన్నో సార్లు పలు నివేదికల ద్వారా వెల్లడించింది. ఇప్పుడు అదే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో గుర్తు చేశారు. జల్ జీవన్ మిషన్ పేరిట నిర్దేశిత పట్టణాల్లోని 2 కోట్ల 86 లక్షల కుటుంబాలకు నల్లా కనెక్షన్‌లు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఇక అమృత్ పరిధిలోని 500 పట్టణాల్లో నీటి వృథాను నిలువరించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు విత్తమంత్రి నిర్మలా సీతారామన్.
పరిశుభ్రత ముఖ్యం
ఇక పట్టణాల్లో పరిశుభ్రతకూ ప్రాధాన్యతనిచ్చింది కేంద్రం. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు చేసేందుకు లక్షా 41 వేల 678 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ ఏడాది నుంచి ఐదేళ్ల పాటు ఇది అమలు కానుంది. పట్టణాలన్నింటినీ 100% బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలుగా మార్చాలని గతంలోనే కేంద్రం లక్ష్యం పెట్టుకుంది. అదే సమయంలో ఘన వ్యర్థాల నిర్వహణనూ పటిష్టంగా చేపట్టాలని నిర్దేశించుకుంది. ఇప్పుడు స్వచ్ఛ భారత్ 2.0లో భాగంగా... మురుగు నీటి నిర్వహణపైనా దృష్టి సారించింది. మురుగు నీటిని రీసైక్లింగ్ చేసేలా స్థానిక యంత్రాంగాలు చొరవ చూపాలని చెబుతోంది కేంద్రం. నీటి వృథా నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ, చెత్తను సరైన పద్ధతిలో వేరు చేయటం, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను తగ్గించటం, వాయు కాలుష్యం, క్రమ పద్ధతిలో నిర్మాణాలు లాంటి అంశాలపైనా ప్రత్యేక దృష్టి సారించింది కేంద్రం. ఈ మేరకు బడ్జెట్‌లో ప్రస్తావించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
ప్రజా రవాణా విస్తరణకు కసరత్తులు