Buddhavanam in Nagarjuna Sagar: కృష్ణమ్మ ఒడ్డున.. ఎత్తైన కొండల పక్కన.. చుట్టూ పచ్చదనంతో.. ఆహ్లాదకర వాతావరణంతో బుద్ధవనం ప్రాజెక్టు ఆకట్టుకుంటోంది. తెలంగాణలోని నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని హిల్ కాలనీలో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ప్రాజెక్టు పర్యాటకులకు కనువిందు చేయనుంది. ఇక్కడి బుద్ధుడి శిల్పాలు, బౌద్ధ చిహ్నాలు ధ్యానాన్ని ప్రేరేపించిన అనుభూతి కలిగిస్తాయి.
274 ఎకరాల విస్తీర్ణంలో..
Buddhavanam at Hills Colony : బుద్ధవనం ప్రాజెక్టును 274.28 ఎకరాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఒకవైపు బుద్ధుని జీవిత ఘట్టాల శిల్పాలతో అలంకరించిన బుద్ధ చరితవనం.. మరోవైపు సిద్ధార్థుడు బోధిసత్వుడిగా ఉన్నప్పుడు పరిపూర్ణతను సాధించడానికి ఆచరించిన 10 పారమితలను ప్రతిబింబించే జాతకవనం.. ఇంకొంచెం ముందుకు వెళితే ధ్యానవనం.. అందులో శ్రీలంక ప్రభుత్వం బహూకరించిన 27 అడుగుల బుద్ధుని శిల్పం.. దమ్మభూషణ వినిపించే గంట.. సందర్శకులను మైమరపింపజేస్తాయి. బుద్ధుడు బోధించిన జీవన విధానాన్ని తెలిపే శిల్పాలు చూపు మరల్చనివ్వవు. బుద్ధవనంలోని మహాస్తూపం.. దేశంలోనే అరుదైన బౌద్ధ వారసత్వ కట్టడంగా కీర్తి గడించింది. కింది అంతస్తులో ప్రాచీన బౌద్ధ శిల్ప కళాఖండాలున్న ప్రదర్శనశాల, సమావేశ మందిరం, ఆచార్య నాగార్జునుడి పంచలోహ విగ్రహం ఉన్నాయి. మొదటి అంతస్తులో అష్టమంగళ చిహ్నాలు, సిద్ధార్థ గౌతముని అయిదు ప్రధాన జీవిత ఘట్టాలను సూచించే ఆయక స్తంభాలు.. వేదిక, అండం చుట్టూ అలంకరించిన అద్వితీయ బౌద్ధ శిల్ప కళాఖండాలు.. వాటిలో ఆచార్య నాగార్జునుడు, ధర్మచక్ర పరివర్తన ముద్రలో బుద్ధుడు.. తార, మైత్రేయనాథ, భవచక్ర శిల్పాలను ఆళ్లగడ్డ శిల్పులు తీర్చిదిద్దారు.
చరిత వనంలో బుద్ధుడు
Buddhavanam Project : బుద్ధవనం ఆధ్యాత్మికంగానే కాదు ప్రకృతి పర్యాటకుల్నీ ఆకర్షించనుంది. చెట్ల మధ్యలోంచి ఇటీవల నడకబాట వేశారు. దాని వెంట ఒకటిన్నర కి.మీ. నడుచుకుంటూ వెళ్తే.. మధ్యమధ్యలో చిన్నపాటి దీవుల్ని తలపించే కొండలు, చుట్టూ నీలి రంగు జలాలతో కృష్ణా నది అలరిస్తుంది. ఎత్తైన ప్రదేశం.. రాతి బండలపై నుంచి ఎటుచూసినా కృష్ణా జలాలే. దీన్ని ‘రివర్ వ్యూ టీ పాయింట్’గా అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. బుద్ధవనం ప్రాంతంలో సంచరించే మనుబోతులు, దుప్పులు, నెమళ్లు, కుందేళ్లు మరో ప్రత్యేక ఆకర్షణ.
ముఖ్యమంత్రి సంకల్పంతో..