తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్, వాటి అనుబంధ తాజా కోర్సుల్లో 19 వేల సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆయా కళాశాలలు బీటెక్‌లో డిమాండ్ లేని బ్రాంచిల్లో సీట్లు తగ్గించుకొని.. వాటికి సమానంగా డిమాండ్ ఉన్న కొత్త బ్రాంచిల్లో సీట్లు పొందాయి.
అలానే ఎన్‌బీఏ గుర్తింపు ఉన్న బ్రాంచిలలో అదనంగా మరో కోర్సు లేదా అదనపు సెక్షన్‌ను తెచ్చుకున్నాయి. దీని ప్రకారం గత ఏడాది కంటే ఈసారి దాదాపు 4,250 సీట్లు అదనంగా పెరగనున్నాయి. సీట్ల మార్పు, పెంపునకు దరఖాస్తు చేసుకున్న కళాశాలలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆమోదం తెలిపింది.
15 వరకు ఆగాల్సిందే
పెరిగిన సీట్లలో జేఎన్‌టీయూహెచ్ పరిధిలో 3,750 ఉండగా... ఓయూ పరిధిలోని కళాశాలల్లో 450-500 వరకు ఉన్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. మొత్తంగా 198 ప్రైవేట్ కళాశాలల్లో ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన సీట్లు 1.13 లక్షలకు పెరగనున్నాయి.
ఏఐసీటీఈ అనుమతి ఇచ్చినా విశ్వవిద్యాలయాలు ఆ సీట్లకు అనుబంధ గుర్తింపు ఇస్తాయా? అనేది తేలాలంటే ఈ నెల 15 వరకు ఆగాల్సిందే. కొత్త కోర్సులు, అదనపు సెక్షన్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం అనుమతి ఇవ్వాల్సి ఉంది.