ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్ పెట్టాల్సిందేనని మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. తెలంగాణలోని నల్గొండలో నిర్వహించిన రాజ్యాధికార సంకల్ప సభలో బహుజన్ సమాజ్ పార్టీలో చేరిన ప్రవీణ్‌కుమార్.. కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. 2014 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం ఎన్ని నోటిఫికేషన్లు విడుదల చేసిందని ప్రశ్నించారు. ఇప్పడు మాత్రం హుజురాబాద్ ఉపఎన్నికలు అనగానే నోటిఫికేషన్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఆ ఇచ్చిన నోటిఫికేషన్లకు కూడా రిక్రూట్మెంట్లు లేవని ఆరోపించారు. మాటల గారడీలతోనే తెలంగాణ ప్రజలను పాలకులు ఏడేళ్లుగా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
సంపదంతా 5 శాతం కులాల మధ్యే...
దేశంలో ఉన్న మిలియనీర్లలో ఒక్కరు కూడా ఎస్సీ, ఎస్టీలు లేరని తెలిపిన ప్రవీణ్‌కుమార్... సంపద అంతా 5 శాతం ఉన్న కులాల మధ్యే ఉందని ఉద్ఘాటించారు. మిగతా 95 శాతం మంది నిరుపేదలేనని వివరించారు. 1956 నుంచి ఇప్పటి వరకు 46 మంది భారతరత్న ఇస్తే.. ఒక్క ఓబీసీకి, ఇద్దరు ఎస్సీకి మాత్రమే వచ్చిందని గుర్తు చేసిన ప్రవీణ్‌కుమార్.. ఆ గౌరవంతో సత్కరించేందుకు ఒక్కరు కూడా దొరకలేదా అని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి తెలంగాణ వరకు పాలించిన 11 మంది ముఖ్యమంత్రుల్లో 10 మంది ఆధిపత్య కులాలకు చెందినవారేనని స్పష్టం చేశారు. 1980 వరకు సుప్రీ కోర్టులో ఎస్సీ, ఎస్టీ, బీసీకి సంబంధించిన ఒక్క జడ్జి కూడా లేరని ప్రవీణ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
రిజర్వేషన్ మన హక్కు...
"మాన్యశ్రీ కాన్షీరాం చెప్పినట్టు జనాభా దామాషా ప్రకారం అధికారంలో వాటా ఇవ్వాలే. ఇవ్వకుంటే గుంజుకుంటాం. బహుజన రాజ్యంలో అన్ని కులాలకు సమానమైన వాటా ఉంటుంది. లక్షలాది మంది విదేశీ విద్య అభ్యసిస్తారు. ప్రతీ మండలానికి ఓ ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుంది. బహుజన రాజ్యంలో ఇండియా.. చైనాతో పోటీపడుతుంది. కల్లుగీత కార్మికుల బిడ్డలు కంప్యూటర్ చదువుతారు. మైనారిటీ బిడ్డలు డాలర్లు సంపాదిస్తరు. ఆదివాసీ బిడ్డలు ఏ దేశానికైనా పోతారు. బంజారా బిడ్డలు బస్తీల్లో కాదు.. బంగ్లాల్లో ఉంటారు. గ్రానైట్లతో రాళ్లు పగులగొట్టిన వడ్డెర కార్మికుల బిడ్డలు రాకెట్లు ప్రయోగిస్తరు. చిందు కళాకారుల బిడ్డలు సినిమా రంగంలోకి పోతారు. వాళ్లే సొంతంగా కంపెనీలు పెట్టి వందల మందికి ఉపాధి కల్పించి... సంపదలు సృష్టిస్తారు. ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్ కావాల్సిందే. ప్రాజెక్టులు కట్టింది మనమే. పంట పండించి తిండి పెట్టింది మనమే. ఇంత చేసిన మనకు దేశ సంపదలో భాగమేందుకు ఉండదు. ప్రైవేట్‌లో రిజర్వేషన్ మన హక్కు." - ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఐపీఎస్, బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్
బానిసలు అవుతారా.. పాలకులు అవుతారా...?
బహుజన రాజ్యం ఈజీగా రాదని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. తరతరాలుగా దోపిడీ చేసి ఆధిపత్యం చలాయించిన వాళ్ళు... ఎన్నికల్లో డబ్బులు వెదజల్లుతారని... మాయ చేస్తారన్నారు. వాటన్నింటినీ ఎదుర్కొనేందుకు.. ప్రతీ ఒక్కరు కాన్షీరాం... మాయావతి... కావాలని సూచించారు. ఈ నల్గొండ సభ తెలంగాణ రాజకీయాలు మాత్రమే కాదు.. భారతదేశ రాజకీయాలను మార్చుతుందని ఆకాంక్షించారు. బానిసలు అవుతారా.. పాలకులు అవుతారా...? కారు కింద పడతారా... ఏనుగు ఎక్కిపోతారా..? అంటూ తేల్చుకోవాలని కార్యకర్తలను ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు.
ఇదీ చూడండి:
RS PRAVEEN KUMAR: 'బహుజన రాజ్యం చాలా దగ్గరగా ఉందనిపిస్తోంది'