మన మదిలో మెదిలే ఆలోచనలే స్వర్గం, నరకానికి కేంద్ర స్థానమంటారు మనసు సంగతి తెలిసిన మహాకవులు, మనోవిజ్ఞానవేత్తలు. వయసు పైబడినా ఉరకలెత్తే ఉత్సాహం కనబరిచే వ్యక్తులు కొందరైతే... అకాలంగా వయోభారాన్ని మోస్తున్నట్లు మరికొందరు కనిపిస్తారు. శారీరక, మానసిక వయసు మధ్య ఈ వ్యత్యాసం ఎలా ఏర్పడుతోంది. ఈ విషయం ఆయా వ్యక్తులకు స్వయంగా తెలుస్తుందా? దీనికి సంబంధించి వారి వ్యక్తిగత ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? ఏయే సందర్భాల్లో తాము వాస్తవిక వయసు కన్నా పెద్ద వాళ్లమయ్యామనే అభిప్రాయం వారిలో కలుగుతుంది? పురుషుల్లో, మహిళల్లో ఇటువంటి భావన సమానంగా ఉంటుందా?... వయోధికులమయ్యామనే విచారంలో కూరుకుపోయే వ్యక్తులకు సమాజం, వైద్యపరంగా ఎలాంటి చేయూత కావాలి? తదితర ప్రశ్నలకు సమాధానాలను అన్వేషించే యత్నం చేశారు...బ్రిటన్ పరిశోధకులు. 14,757 మంది నుంచి పలు ప్రశ్నల ద్వారా సమాచారం సేకరించి విశ్లేషించి కొన్ని నిర్ధారణలకు వచ్చారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో అందరూ 50 ఏళ్లకు పైబడిన వాళ్లే. సగటు వయసు 67 ఏళ్లు. ఎక్సేటర్ విశ్వవిద్యాలయం సహాయంతో అధ్యయనం చేసినట్లు ప్రొటెక్ట్ సంస్థ వెల్లడించింది. ఆన్‌లైన్ ద్వారా ప్రశ్నలు సంధించి వచ్చిన సమాధానాలను విశ్లేషించినట్లు తెలిపింది.
మూడు కేటగిరీల్లో వర్గీకరణ..
1. శారీరక వయసు కన్నా తక్కువ వయసు తమదని భావిస్తున్న వ్యక్తులు
2. శారీరక, మానసిక వయసు దాదాపు సమానంగా ఉన్నట్లు తెలిపిన వ్యక్తులు
3. వాస్తవిక వయసు కన్నా మానసికంగా ఇంకా పెద్దవాళ్లమై పోయామనే చింతతో ఉన్నవారు.
మొదటి, రెండో కేటగిరీల్లోని వ్యక్తులు.. జీవితంపై సానుకూల దృక్పథం, మంచి ఆరోగ్యం, ఆదర్శప్రాయమైన జీవనశైలి, శారీరక దృఢత్వం కలిగి ఉన్నారు. వీరితో పోల్చినప్పుడు మూడో కేటగిరీలోని వాళ్లు ప్రతికూల ఆలోచనలతో పాటు అనారోగ్యం, కుటుంబంలో కలతలు, సన్నిహితులను కోల్పోవడం, మానసిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. వివాహం కాకపోవడం, ఉద్యోగ విరమణ, నిరుద్యోగం, తక్కువ విద్యార్హతలు, మానసిక రుగ్మతలు, దుర్ఘటనలు వంటివి వారిలో నైరాశ్యానికి దారితీస్తున్నాయి. తృతీయ విభాగంలో అత్యధికంగా మహిళలున్నారు. పురుషుల కన్నా వీరిలో ప్రతికూల ఆలోచనలు అధికంగా ఉన్నాయని గుర్తించారు. మెనోపాజ్ దశకు చేరుకోవడం, జీవిత భాగస్వామిని కోల్పోవడం, కుటుంబంలో మనవళ్లు/మనవరాళ్లను సంరక్షించే బాధ్యతలు నిర్వర్తిస్తుండడం వంటివి వారిలో వయసు రీత్యా తాము పెద్ద వాళ్లమై పోయామనే భావనలకు కారణమవుతున్నాయని గుర్తించారు. రెండో కేటగిరీలోని వ్యక్తులు..తాము అసలు వయసు గురించే ఆలోచించడంలేదని, చిన్న, పెద్ద భావనే కలగలేదని పేర్కొన్నారు. తొలి విభాగంలోని వ్యక్తులు..దాపరికంలేని వ్యక్తిత్వం, ధర్మ విచక్షణ, తమకన్నా తక్కువ వయసు వారితో సమయం వెచ్చించడం, వయసు పెరగడంపై సానుకూల దృక్పథం తదితర లక్షణాలు కలిగి ఉన్నారు. మరికొందరైతే వయసు పైబడటాన్ని వాస్తవిక దృక్పథంతో స్వాగతించారు.
పరిష్కారం ఏమిటంటే..
వాస్తవిక వయసుకన్నా పెద్దవాళ్లమై పోయామనే ఆలోచనలతో మునిగిపోతున్న వ్యక్తుల్లో ఉత్సాహం నింపాలంటే వారిలోని ప్రతికూల ఆలోచనలను దూరం చేయాలని అధ్యయనం పేర్కొంది. వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని, సమాజపరంగానూ వారికి చేయూతనివ్వాలని తెలిపింది.
సర్వేలో భాగస్వాములైన వ్యక్తుల సమాధానాలు కొన్ని..
63 ఏళ్ల పురుషుడు: వారానికి 45 మైళ్ల దూరం నడుస్తున్నా. నా వయసులో సగం ఉన్న వారితో పోల్చుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని భావిస్తున్నా.
87 ఏళ్ల పురుషుడు: నా పెద్ద కుమారుడికి 64 ఏళ్లు. వాడికంటే నేనే చిన్న వాడిలా కనిపిస్తున్నానని అనిపిస్తుంది.