తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ప్రగళ్లపాడుకు చెందిన యరమల బుజ్జినాగశేషురెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. ముంబయిలో ఉద్యోగం చేస్తున్నాడు. లాక్‌డౌన్ తర్వాత ఇంటి దగ్గర్నుంచే పనిచేస్తున్నాడు. అయ్యవారిగూడేనికి చెందిన మరదలు(మేనమామ కుమార్తె) లక్కిరెడ్డి నవ్యరెడ్డిని ఇష్టపడ్డాడు. గతేడాది డిసెంబరు 9న ఆమెను వివాహం చేసుకున్నాడు. నవ్యరెడ్డి సత్తుపల్లి మండలం గంగారంలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ నెల 2న కళాశాలకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఆమెను ద్విచక్రవాహనంలో ఎక్కించుకుని కళాశాలకు బయల్దేరిన భర్త మార్గమధ్యలో పండ్లరసంలో నిద్రమాత్రలు కలిపాడు. అపస్మారక స్థితిలోకి చేరాక ఆమె చున్నీతో చెట్టుకు ఉరేశాడు.
పనిచేయని ‘చావు’ తెలివితేటలు
‘ఇంజినీరింగ్‌లో బ్యాక్‌లాగ్‌లు ఉండటంతో మనస్తాపంతో తాను ఆత్మహత్య చేసుకున్నట్లు’ యువతి తండ్రికి ఆమె చరవాణి నుంచే సంక్షిప్త సందేశం పంపి ఇంటికి వెళ్లిపోయాడు. ఈ నెల 3న తన భార్య కనిపించడంలేదంటూ ఎర్రుపాలెం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. మూడు రోజులుగా వారితోనే ఉంటూ వెదుకుతున్నట్టు నటిస్తున్నాడు. దర్యాప్తు ఆరంభించిన పోలీసులు అతను చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా సీసీ కెమెరాలను పరిశీలిస్తూ వెళ్లారు. ఈ నెల 2వతేదీ సాయంత్రం 3:58 గంటల సమయంలో భార్యాభర్తలు ద్విచక్రవాహనంపై పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల సమీపంలో తిరిగినట్టు అక్కడి సీసీ కెమెరాలో కన్పించడంతో బుజ్జినాగశేషురెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తానే భార్యను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించడంతో పోలీసులు శుక్రవారం అతన్ని ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. ‘మృతదేహం కుళ్లిపోయింది. ఆమెను ఎందుకు చంపాడో నిందితుడు చెప్పలేదు’ అని వైరా ఏసీపీ సత్యనారాయణ తెలిపారు.