Break to Amaravathi Padayatra: నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు నేడు రైతులు విరామం(2nd Day Break to Amaravathi Padayatra) ప్రకటించారు. శనివారం పాదయాత్ర ముగిసిన అంబాపురం గ్రామంలోనే రైతులు బస చేస్తున్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు అంబాపురం శాలివాహన ఫంక్షన్ హాల్ వద్ద నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపారు. వారు బస చేస్తున్న ప్రాంగణంలోనే కళాకారులు అమరావతి ఉద్యమానికి సంబంధించిన గీతాలను ప్రదర్శించారు. అయితే అమరావతి రైతుల మహాపాదయాత్ర నెల్లూరు జిల్లాలో అద్వితీయంగా కొనసాగుతోంది. అన్నదాతలకు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభిస్తోంది. ఈ క్రమంలో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో యాత్రను ఆదివారం రద్దు చేసుకున్న రైతులు.. నేడు(సోమవారం) సైతం విరామం ప్రకటించారు.
సంఘీభావం ప్రకటించిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు..
నెల్లూరులో అమరావతి రైతులను కలుస్తున్న వివిధ సంఘాల నాయకులు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. రైతులు బస చేసిన ఎస్.ఎస్.బి. కళ్యాణ మండపం వద్దకు వచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు రైతులకు తమ సంఘీభావం ప్రకటించారు. విశాఖ ఉక్కు, రాజధాని అమరావతి కోసం కలిసి పోరాడుతామని వారు ప్రకటించారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ పోరాట కమిటీ నేత శ్రీనివాసరావు పాదయాత్ర జేఏసీకి 2,65,216 రూపాయల విరాళాన్ని అందించారు.