కరోనా సమయంలో సేవాకార్యక్రమాలు చేస్తూ రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న సినీ నటుడు సోనూసూద్‌ను సినిమాలో హీరో కొడుతుండటంతో తట్టుకోలేక ఏడేళ్ల బాలుడు టీవీని పగలగొట్టాడు. ఈ ఘటన తెలంగాణ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ గ్రామంలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం వేపలసింగారానికి చెందిన చడపంగు గురవయ్య, పుష్పలత తమ కుమారుడు విరాట్‌తో కలిసి శుభకార్యానికి హాజరయ్యేందుకు అక్కడకు వెళ్లారు. కుటుంబ సభ్యులందరు కలిసి టీవీలో సినిమా చూస్తున్నారు. ఆ సినిమాలో విలన్‌గా సోనూసూద్ కనిపించారు.
విలన్ పాత్రలో ఉన్న సోనూసూద్‌ను హీరో కొట్టడంతో కోపానికి గురైన విరాట్... సేవా కార్యక్రమాలు చేసే మా అంకుల్ని కొడతావా.. అంటూ ఆరు బయట నుంచి రాయి తీసుకొచ్చి టీవీని పగులగొట్టాడు. బాలుడి కోపాన్ని చూసి కుటుంబ సభ్యులు నివ్వెరపోయారు. టీవీ ఎందుకు పగులగొట్టావని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా సోనూసూద్‌ను కొట్టినందుకు కోపమొచ్చిందని చెప్పడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే.. ఈ విషయాన్ని సోనూసూద్ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం కొసమెరుపు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.