బల్దియా ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్ల కోసం ప్రముఖ అంకుర సంస్థ బౌన్స్ ఓ ఆఫర్ ప్రకటించింది. పోలింగ్ రోజున ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు తమ ద్విచక్రవాహనంపై ఉచితంగా వెళ్లొచ్చని తెలిపింది. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ హైదరాబాద్ ఇంఛార్జ్ శివ వెల్లడించారు.
బైక్ ఇస్తాం... ఓటేయండి... బౌన్స్ సంస్థ ఆఫర్
తమ ద్విచక్రవాహనాలపై ఉచితంగా వెళ్లి బల్దియా ఎన్నికల్లో ఓటు వేయండి అని ప్రముఖ అంకుర సంస్థ బౌన్స్ ప్రకటించింది. బల్దియా పోలింగ్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ హైదరాబాద్ ఇంఛార్జ్ శివ వెల్లడించారు.
1500 కేంద్రాల్లో ఐదువేల వాహనాలు అందుబాటులో ఉంచామని శివ తెలిపారు. ఏడాది నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్న బౌన్స్ సాధారణ రోజుల్లో.. కిలోమీటరుకు రూ.3.50లకే తమ వాహనాన్ని వినియోగించుకునే అవకాశం కల్పిస్తోందని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకే ఉచితంగా ద్విచక్రవాహనాలపై వెళ్లే అవకాశం కల్పిస్తున్నామని శివ వెల్లడించారు. ఓటర్లు తమ ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి, తిరిగి పోలింగ్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లేందుకు ఉచితంగా తమ వాహనాన్ని వినియోగించుకోవచ్చని బౌన్స్ నిర్వాహకులు తెలిపారు.