పవన్ కల్యాణ్ తీరు తెదేపా అవినీతిని ప్రోత్సహిస్తున్నట్టు ఉందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అమరావతి సామాన్యులకా... సంపన్నులకా అని అన్నది పవన్ కాదా...? అంటూ ప్రశ్నించారు. రాజధాని పేరుతో నూజివీడు వాసులను తెదేపా మోసం చేసిందని పవన్ గతంలో చెప్పలేదా...? అని నిలదీశారు. 5వేల ఎకరాల్లో రాజధానిని కట్టేస్తామని ఆయన విజయవాడ సభలో చెప్ప లేదా... అని ప్రశ్నల వర్షం కురిపించారు. పవన్ ద్వంద్వ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. జగన్‌పై ప్రజలు నమ్మకంతో గెలిపించారని ఉద్ఘాటించారు.
పవన్ ద్వంద్వ వైఖరి మార్చుకో: బొత్స - Pawan
రాజధాని పరిధి ప్రాంతంలో భూములపై సమీక్ష చేసినట్లు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తాత్కాలిక సచివాలయం పేరుతో చదరపు అడుగు రూ.10వేల చొప్పున ఖర్చు చేశారన్న బొత్స... ఒక రాజధాని... వెయ్యి కుంభకోణాలు అన్నచందంగా ఉందని ఎద్దేవా చేశారు. పవన్... చంద్రబాబు అధికారంలో ఉండగా ఆయన్ను ప్రశ్నించలేదని విమర్శించారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై మాట్లాడకుండా... ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
పోలవరంపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్తుంటే తెదేపా నేతలు గగ్గోలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. టెండర్లలో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందనేది తమ ఆవేదన అని స్పష్టం చేశారు. 5కోట్ల ప్రజల ఆకాంక్షలు... 13జిల్లాల అభివృద్ధే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 10వ వర్ధంతి రోజున సీఎం జగన్ చేతుల మీదుగా విజయవాడలోని కంట్రోల్ రూం ఎదురుగా ఉన్న పార్కులో వైఎస్సార్ విగ్రహాన్ని పునః ప్రతిష్టించనున్నట్లు మంత్రి బొత్స తెలిపారు. పీపీఏలపై చట్టపరంగా పోరాడతామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ...'అభివృద్ధికి విఘ్నాలు తొలగాలి.. విజయాలు కలగాలి'