సామాజిక మాధ్యమాల్లో ఎవరిపై ఎలాంటి అనుచిత పోస్టులు పెట్టినా... ఆ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సామాజిక మాధ్యమాల్లో తనపై పెట్టిన పోస్టులను ప్రతిపక్ష నేత చంద్రబాబు చదివి వినిపించడానికి మీడియా సమావేశం పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. సీనియర్ రాజకీయ నాయకుడని పదేపదే చెప్పుకునే చంద్రబాబు ఏం అశించి ఇలా వ్యవహరిస్తున్నారని బొత్స ప్రశ్నించారు. ప్రతి అంశాన్ని రాజకీయ లబ్ధికోసం వాడుకోవాలనుకోవడం దురదృష్టకరమన్నారు. అధికారం పోయాక చంద్రబాబులో అసహనం పెరిగిపోయిందన్నారు. నాలుగు నెలల కాలంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారన్నారు. అనుభవం ఉన్న చంద్రబాబు నిర్మాణాత్మక సూచనలు, సలహాలతో సహకరించకపోగా.. విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఇప్పటికీ తానే ముఖ్యమంత్రిగా ఉన్నాననే ధోరణితో బెదిరింపులకు పాల్పడుతున్నారన్న బొత్స... వైకాపా నేతలు, కార్యకర్తలు ఏమీ భయపడరన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై సమగ్ర విచారణ జరగాల్సి ఉందన్నారు. ఈ పోస్టులు కూడా చంద్రబాబు, తెదేపా వారే పెట్టుంటారనే అనుమానం కలుగుతుందని బొత్స వ్యాఖ్యానించారు.
'చంద్రబాబుపై అనుచిత పోస్టులు వారి పనే కావచ్చు' - వారే పోస్టులు పెట్టారేమోనన్న అనుమానం
సామాజిక మాధ్యమాల్లో ఎవరిపై అనుచిత వ్యాఖ్యలు చేసినా వాటిని వైకాపా తీవ్రంగా ఖండిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు... రాష్ట్ర అభివృద్ధికి విలువైన సలహాలు అందించకుండా ప్రతీ అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని బొత్స ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబుపై తెదేపా వారే పోస్టులు పెట్టారేమోనన్న అనుమానం కలుగుతుందన్న బొత్స... చంద్రబాబు అధికారం కోల్పోయారన్న విషయాన్ని మరిచారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబుపై అనుచిత పోస్టులు ఆ పార్టీ వాళ్ల పనే : మంత్రి బొత్స