కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల సమగ్ర నివేదిక(డీపీఆర్)లు, టెలిమెట్రీ రెండోదశ, నిధులు తదితర అంశాలను బోర్డు అజెండాలో చేర్చింది. ఇంకా చేర్చాల్సిన విషయాలుంటే ఈ నెల 26 లోగా సూచించాలని రెండు రాష్ట్రాలకు 21వ తేదీన లేఖలు రాసింది. దీనిపై గురువారం సాయంత్రం వరకు రెండు రాష్ట్రాల నుంచి సమాధానం అందలేదు. అజెండాను శుక్రవారం లోగా ఖరారు చేయాల్సి ఉందని, ఈలోగానైనా పంపాలని రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులకు బోర్డు తాజాగా సూచించినట్లు తెలిసింది.
శ్రీశైలం నుంచి కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ఉత్తర్వులు జారీ చేయడంతో బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణపై ఫిర్యాదు చేసింది. దీంతో బోర్డు ఒక రాష్ట్రం చేసిన ఫిర్యాదును ఇంకో రాష్ట్రానికి పంపి వివరణ కోరింది. ఈ వివరణలు కూడా ఇంకా అందలేదు. అజెండా ఖరారులో రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.
కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ అపెక్స్ కౌన్సిల్ సమావేశం కోసం అజెండాలో చేర్చాల్సిన అంశాలను వెంటనే పంపాలని బోర్డు ఈ నెల 21న రెండు రాష్ట్రాలకు రాసిన లేఖకు కూడా స్పందన లేదు. వచ్చే వారంలో కృష్ణా బోర్డు సమావేశం నిర్వహించే అవకాశం ఉందని, దీని తర్వాతే అపెక్స్ కౌన్సిల్ సమావేశం గురించి ఆలోచిస్తారని సమాచారం.
‘కొత్త ప్రాజెక్టు’పై ఆంధ్రప్రదేశ్‌కు బోర్డు లేఖ