అమరావతి దార్శనికపత్రంలో పేర్కొన్న లక్ష్యాలను చేరుకోవాలంటే రూ.1.10 లక్షల కోట్లు అవసరమవుతాయని బోస్టన్ కమిటీ నివేదిక తెలిపింది. అంత మొత్తాన్ని ఒకే నగరంలో పెట్టడం అవసరమా? అనేది ఆలోచించాలని... అమరావతి నిర్మాణానికి రుణం తీసుకొస్తే ఏటా పది వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి ఉంటుందని పేర్కొంది. పెట్టుబడులు- రాబడి కోణంలో ఇది ఆర్థిక భారమేనని వెల్లడించింది. అమరావతి భూములు అమ్మకం ద్వారా వచ్చే నిధులు సరిపోవని.. 40 ఏళ్ల తర్వాత వచ్చే రాబడి కోసం ఇప్పుడింత పెట్టుబడి అవసరం లేదని అభిప్రాయపడింది.
పరిపాలన వికేంద్రీకరణ మంచిదే..!
అమరావతిపై పెట్టే లక్ష కోట్ల రూపాయలను నీటి పారుదలపై ఖర్చు చేస్తే మంచి ఫలితాలొస్తాయని బీసీజీ నివేదిక పేర్కొంది. సచివాలయానికి వచ్చిన ఓ లక్ష మంది పౌరుల సగటు పనిని మదింపు చేసిన కమిటీ పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా శాటిలైట్ కమిషనరేట్‌లు ఏర్పాటు చేయాలని సూచించింది. వీటి ద్వారా ప్రజలపై ఖర్చు తగ్గించడంతోపాటు.. వారికి సత్వర సేవలు అందించే సౌకర్యం ఉంటుందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం వార్డు, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసినందున ఫలితాలు మెరుగవుతాయని కమిటీ అభిప్రాయపడింది.
6 శాటిలైట్ కమిషనరేట్లు
- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు
- ఉభయగోదావరి జిల్లాలకు
- కృష్ణా-గుంటూరు జిల్లాలకు
- ప్రకాశం-నెల్లూరు జిల్లాలకు
- చిత్తూరు-కడప జిల్లాలకు
- అనంతపురం-కర్నూలు జిల్లాలకు